Aug 20,2022 11:32

అమరావతి : ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకోకముందే ... మంకీపాక్స్‌ వైరస్‌ కలవరం రేగింది. మంకీపాక్స్‌ కేసులు అక్కడక్కడ నమోదవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువైంది. భారతదేశంలో ఇప్పటి వరకు 10 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ... మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కిట్‌ మొట్టమొదటిసారి స్వదేశంలోనే తయారుకావడం గమనార్హం.

                                                           ట్రాన్సాసియా ఎర్బా పేరుతో కిట్‌ తయారీ..

విశాఖలోని మెడ్‌ టెక్‌ జోన్‌లో ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ సంస్థ ఆర్టీపీసీఆర్‌ విధానంలో మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ను అభివృద్ధి చేసింది. ట్రాన్సాసియా ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ అజయ్ కుమార్‌ సూద్‌ శుక్రవారం మెడ్‌టెక్‌ జోన్‌లో ఆవిష్కరించారు.

                        ఇన్ఫెక్షన్‌ను ముందుగానే గుర్తించవచ్చు : ట్రాన్స్‌ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్‌ వజిరాణి

కిట్‌ ఆవిష్కరణ అనంతరం ట్రాన్స్‌ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్‌ వజిరాణి మాట్లాడుతూ ... ఈ కిట్‌ అత్యంత సున్నితమైనదన్నారు. అయినప్పటికీ ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కిట్‌ సాయంతో ఇన్ఫెక్షన్‌ను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్‌ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్‌ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్‌ మాజీ డైరెక్టర్‌ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు.

                                                                      డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిక...

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గత వారంలో మంకీపాక్స్‌ కేసులు 20 శాతం పెరిగాయి. 92 దేశాల నుండి 35,000 కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు, 12 మరణాలు నమోదయ్యాయి.

                                                             మశూచిని పోలి ఉంటుంది : డబ్ల్యుహెచ్‌ఒ

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ వివరాల ప్రకారం.. మంకీపాక్స్‌ అనేది జంతువుల నుండి మానవులకు సంక్రమించే ఒక వైరస్‌, దాని లక్షణాలు మశూచిని పోలి ఉంటాయి. అయినప్పటికీ వ్యాధి వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది.

డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ... సుమారు 7,500 కేసులు గత వారం నివేదించబడ్డాయన్నారు. ఇది మునుపటివారం కంటే 20 శాతం ఎక్కువ అని తెలిపారు. మరో వారం క్రితం కంటే 20 శాతం ఎక్కువ అని చెప్పారు. దాదాపు అన్ని కేసులు యూరప్‌, అమెరికా నుండి వస్తున్నాయని అన్నారు.