Jan 31,2023 07:44

పెట్టుబడి ఈ ప్రపంచం నెత్తిమీద కూచుని కోట్లాదిమంది కార్మికులను వేలాది మైళ్ళ దూరాలకు తరలిస్తోంది. అది కేవలం తన పెట్టబడి పోగుబడడం కోసం మాత్రమే. అంటే పెట్టుబడి పోగుబడే ప్రక్రియను కార్మికశక్తి నియంత్రించడం లేదు. పెట్టుబడి పోగుబడడం అనేది నిరంతరాయంగా కొనసాగడానికి వీలుగా కార్మికశక్తి సర్దుబాటు అవుతోంది. అందుచేత ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు చెప్పేటట్టు కార్మికశక్తి ''అద్దె సరుకు'' అన్న భావన పూర్తిగా తప్పు.

తనకు అవసరమైన ముడిసరుకులను కావలసిన మేరకు పొందడానికి సామ్రాజ్యవాదం ఆ సరుకులను ఉత్పత్తి చేసే దేశాల మార్కెట్లను అవసరమైతే నియంత్రిస్తుంది. వాటి ఉత్పత్తి ఒకవేళ తగ్గినా, తనకు కావలసిన మేరకు వాటిని పొందడానికి వీలుగా మూడో ప్రపంచ దేశాలలో వాటి వినియోగం తక్కువ ఉండేలా చేయగలుగుతుంది. అందుకు ఇప్పుడు ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ జోక్యమూ అవసరమే లేదు. నయా ఉదారవాద విధానాలే ఆ పని చేస్తాయి.

ర్థశాస్త్రంలో ''అద్దె సరుకు'' అనేదాని గురించి చాలా చర్చ ఉంది. మామూలుగా పెట్టుబడిదారుడు తాను ఎన్ని సరుకులు ఉత్పత్తి చేయదలిస్తే అంత పెట్టుబడి పెడతాడు. కాని కొన్ని రకాల సరుకులు ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ, అనుకున్నంత మేరకు ఉత్పత్తి కావు. వాటి ఉత్పత్తి ప్రకృతి విధించే పరిమితులకు లోబడి వుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు అటువంటివే. ఉదాహరణకు పత్తి. పెట్టుబడిదారుడు ఎంత పత్తి కావాలనుకుంటే అంత పరిమాణంలో దానిని అన్ని వేళలా సంపాదించలేడు. ఎంత పత్తి దొరికితే అంతమేరకే వస్త్రాలను ఉత్పత్తి చేయగలడు. ఈ పత్తి పంట ఏ మేరకు అభివృద్ధి చెందుతూ వుంటుందో ఆ మేరకే అతడు తన ఉత్పత్తిని పెంచుకోగలడు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో ఆ పత్తి దిగుబడిని పెంచగలిగినా, అది కొంతమేరకే సాధ్యం అవుతుంది. అందుచేత వస్త్రాల ఉత్పత్తిపై అంతిమంగా పత్తి లభ్యత నిర్ణయాత్మక ప్రభావం చూపుతుంది. పత్తి వంటివే చాలా ''అద్దె సరుకులు'' ఇంకా ఉన్నాయి.
           సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలలో పేరు పొందిన డేవిడ్‌ రికార్డో భూమిని కూడా ఒక అద్దె సరుకుగా పరిగణించాడు. యూరప్‌ లో కార్మికులు ప్రధానంగా ఆహారంలో వినియోగించే మొక్కజొన్న (ఇక్కడ మనం బియ్యం లేదా గోధుమ ఉపయోగించినట్టుగా) ఉత్పత్తికి అవసరమైన భూమి పరిమితంగా ఉంది. నాసిరకం భూముల్లో మొక్కజొన్నను పండించడానికి సిద్ధపడినా, అంతకంతకూ పనికిరాని భూమి మాత్రమే దొరికే పరిస్థితి వచ్చింది. చివరికి ఆ భూమిమీద పండించడానికి పనిచేసే కూలీలకు చాలినంత కూడా పండని భూములే మిగిలాయి. అందుచేత మొక్కజొన్న సాగు ద్వారా మిగులును ఒకానొక స్థాయికి మించి పోగు చేసుకోవడం పెట్టుబడిదారుడికి అసాధ్యం అయిన పరిస్థితి వచ్చింది. దీనినే రికార్డో ''నిశ్చల స్థితి'' అన్నాడు. అంటే ఆ స్థితిలో మిగులు శూన్యం. కనుక వృద్ధి కూడా శూన్యంగానే ఉంటుంది. ఒక ''అద్దె సరుకు''గా భూమి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఒక నిశ్చల స్థితిలోకి నెట్టింది. అటువంటి స్థితిని వాయిదా వేయగలమేమో గాని పూర్తిగా ఆపు చేయడం అసాధ్యం. ఇదీ రికార్డో చెప్పినది.
          రికార్డో అభిప్రాయాల ప్రకారం శ్రమ ఎన్నటికీ అద్దె సరుకు కాదు. కార్మికుల నిజవేతనాలు ఒకానొక స్థాయి దాటి పెరగగానే కార్మికులు తమను తాము పునరుత్పత్తి చేసుకోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ కార్మిక శక్తికి కొరత ఏర్పడితే వారి డిమాండ్‌ పెరిగి జీతాలు పెరుగుతాయి. అప్పుడు వారు తమను పునరుత్పత్తి చేసుకుంటారు
          ( వివాహాలు చేసుకుని సంతానాన్ని కంటారు). దాంతో కార్మిక శక్తి కొరత తీరిపోతుంది. అందుచేత కార్మికులు ఎన్నటికీ అద్దెసరుకు కారు. కొత్త తరం కార్మికులు తయారు కావడానికి కొంత సమయం పట్టవచ్చు. కాని దీర్ఘకాలంలో కార్మికశక్తి (ఇందాకటి ఉదాహరణలో భూమి మాదిరిగా) పెట్టుబడి పోగుబడడాన్ని ఎన్నటికీ నిరోధించలేదు. ఇది రికార్డో అవగాహన.
         దానికి పూర్తి విరుద్ధంగా ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు కార్మికశక్తిని అద్దెసరుకుగానే పరిగణిస్తారు. జనాభా పెరుగుదల రికార్డో చెప్పినట్టుగా ఒకే తీరుగా ఎప్పుడూ పెరుగుతూ వుండదు. జనాభా పెరుగుదలను నియంత్రించే అంశాలు అనేకం ఉంటాయి. అందుచేత పెట్టుబడి తగినంత ఉన్నా పని చేసే కార్మికులు దొరకని పరిస్థితి వస్తుంది. అందుచేత కార్మికులు కూడా అద్దెసరుకుగానే ఉంటారు. సాంకేతిక అభివృద్ధి కొంతవరకూ కార్మిక కొరతను అధిగమించడానికి తోడ్పడవచ్చు. కాని కార్మికులే అవసరం లేని ఉత్పత్తి అంటూ ఏదీ ఉండదు. జనాభా పెరుగుదల 3 శాతం ఉందనుకోండి. అప్పుడు కార్మిక శక్తి పెరుగుదల కూడా 3 శాతం ఉంటుంది. ఉత్పాదకత పెరుగుదల 2 శాతం ఉందనుకోండి. అప్పుడు ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంలో 5 శాతం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇదీ ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు భావించేది.
        ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక వృద్ధిరేటు దీర్ఘకాలంలో ఏవిధంగా ప్రభావితం అవుతుందో వివరించడానికి సాంప్ర దాయ పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు కాని, ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు కాని అద్దె సరుకు అనే భావనను ఏ విధంగా తెరమీదకు తెచ్చారో మనం చూశాం. కాని ఈ దృక్పథం 'సామ్రాజ్యవాదం' అన్న అంశాన్ని అసలు లెక్కలోకి తీసుకోనే తీసుకోదు. అందుచేత వాస్తవంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పరిణామంలో జరిగేదేమిటో ఈ దృక్పథం వివరించలేదు.
          ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తన దేశపు అంతర్గత మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయివుండదో, అదే విధంగా అది తన అంతర్గత వనరుల లభ్యతకే పరిమితం చేసుకోదు. అది ప్రపంచం అంతా తిరిగి నిర్దాక్షిణ్యంగా ఎక్కడెక్కడి వనరులనూ, మానవ వనరులతో సహా, కొల్లగొట్టి తన దేశీయ మార్కెట్‌కు తోడు చేస్తుంది. అందుచేత అద్దె సరుకు పెట్టుబడిదారీ ఆర్థిక వృద్ధిరేటును దీర్ఘకాలంలో నియంత్రిస్తుంది అన్న సిద్ధాంతం అర్ధం లేనిది.
         కార్మికశక్తినే ఉదాహ రణగా తీసుకుందాం. 19వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో ఆఫ్రికా ఖండం నుండి దాదాపు రెండు కోట్లమందిని బలవంతంగా బానిసలుగా మార్చి ''కొత్త ప్రపంచానికి'' (అమెరికా ఖండానికి) తరలించారు. వారిని అక్కడ గనుల్లో, తోటల్లో చాకిరీకి వినియోగించారు. అక్కడి ఉత్పత్తులు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో (యూరప్‌ లోని దేశాలు) అదనపు మిగులు పోగుబడడానికి దోహదం చేశాయి. ఆ తర్వాత బానిస విధానం అంతం అయింది. అటు తర్వాత, 19వ శతాబ్దపు రెండవ భాగం నుండి (అంటే 1850 తర్వాత నుండి) మొదటి ప్రపంచ యుద్ధం వరకూ 5 కోట్లమంది భారతీయ, చైనా కార్మికులు ప్రపంచంలోని ఇతర ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పని చేయడానికి తరలించబడ్డారు. భారతీయ కార్మికులను వెస్ట్‌ ఇండీస్‌ దీవులలో, ఫిజీ లో, మారిషస్‌ లో, తూర్పు, దక్షిణ ఆఫ్రికాల్లో పనులకు నియమిస్తే, చైనా కూలీలను పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న దేశాల్లో పనుల్లో నియమించారు. ఈ విధంగా వలసలు పోయినవారంతా అక్కడే స్థిరపడకపోయినా, వారిలో గణనీయమైన భాగం మాత్రం స్థిరపడ్డారు.
            రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పెట్టుబడిదారీ విధానం అంతకు ముందెన్నడూ చూడని వృద్ధిని చవి చూసింది. ఆ కాలంలో సంపన్న దేశాల్లో జనాభా వాస్తవానికి తగ్గిపోయింది. అంటు కార్మిక శక్తిలో కూడా వృద్ధి సున్నా అయిపోయింది. కాని అప్పుడు కూడా ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికశక్తికి ఏనాడు కొరత రాలేదు. భారతదేశం నుండి, పాకిస్తాన్‌ నుండి, వెస్ట్‌ ఇండీస్‌ నుండి కార్మికులు బ్రిటన్‌ లో పనులు చేయడానికి వెళ్ళారు. అల్జీరియా, ట్యునీషియా, మొరాకో దేశాల నుండి ఫ్రాన్స్‌ కు వెళ్ళారు. టర్కీ కార్మికులు జర్మనీ వెళ్ళారు. ఇప్పుడు కూడా తూర్పు యూరప్‌ లోని పూర్వ సోషలిస్టు దేశాల నుండి పశ్చిమ యూరప్‌ లోని సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు కార్మికులు తరలివస్తున్నారు. అటు లిథువానియా నుండి ఇటు ఉక్రెయిన్‌ దాకా అన్ని దేశాల కార్మికులూ పశ్చిమ యూరప్‌ దేశాలలో పనులకు తరలిపోతున్నారు. పశ్చిమ సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో సంపద పోగుబడడం కోసం వెనుకబడ్డ ఇతర దేశాల నుండి చౌకగా తమ శ్రమను అమ్ముకోడానికి సిద్ధపడిన కార్మికులు పోతున్నారు.
          ఆ విధంగా పెట్టుబడి ఈ ప్రపంచం నెత్తిమీద కూచుని కోట్లాదిమంది కార్మికులను వేలాది మైళ్ళ దూరాలకు తరలిస్తోంది. అది కేవలం తన పెట్టబడి పోగుబడడం కోసం మాత్రమే. అంటే పెట్టుబడి పోగుబడే ప్రక్రియను కార్మికశక్తి నియంత్రించడం లేదు. పెట్టుబడి పోగుబడడం అనేది నిరంతరాయంగా కొనసాగడానికి వీలుగా కార్మికశక్తి సర్దుబాటు అవుతోంది. అందుచేత ఆధునిక బూర్జువా ఆర్థికవేత్తలు చెప్పేటట్టు కార్మికశక్తి ''అద్దె సరుకు'' అన్న భావన పూర్తిగా తప్పు.
         పెట్టుబడి పోగుబడడం అనేది కేవలం సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో పరిమిత భూభాగాలలో లభించే ముడిసరుకులను ఉపయోగించి చేసే ఉత్పత్తి కార్యకలాపాలకే పరిమితం కాలేదు. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం జౌళి పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామిక విప్లవంతో మొదలైంది. కాని ఆ పారిశ్రామిక విప్లవం సంభవించిన శీతల ప్రదేశాలలో అసలు పత్తి ఏనాడూ పండదు. అంటే, మొదటి నుంచీ పెట్టుబడిదారీ వ్యవస్థ ముడిసరుకుల కోసం, ఆహార ధాన్యాల కోసం ఇతర ప్రాంతాల మీద ఆధారపడి నడిచింది. వాటిని తన సామ్రాజ్యవాద ఆధిపత్య విధానాల ద్వారా సేకరించింది. ఆ సంపన్న పెట్టుబడి దారీ దేశాలకుండే పరిమిత భూభాగం పెట్టుబడి పోగుబడడానికి ఏనాడూ ఒక సమస్య కానేలేదు.
        వలసపాలన కాలంలో ఆహారధాన్యాలు, ముడిసరుకులు వలసల నుండి ఎటువంటి ప్రతిఫలమూ చెల్లించకుండానే బలవంతంగా పట్టుకుపోయేవారు. ఆ వలస పాలన అంతం అయిపోయాక, అటువంటి ఏకపక్ష బదలాయింపులు తగ్గాయి. కాని అప్పటికే ఆ ఉత్పత్తుల విలువలను ఎంతగా కుదించివేశారంటే, ఆ పాటి ధరను వాటికి చెల్లించడం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు పెద్ద సమస్యగా లేకుండా పోయింది. రికార్డో తన 'అద్దె సరుకుల' సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు పరిమిత భూభాగం మాత్రమే ఉన్నందువలన అక్కడ అవసరమైన ముడిసరుకుల (వ్యవసాయ ఉత్పత్తుల, ఖనిజాల) ధరలు క్రమంగా పెరిగిపోతాయని, దాని ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు సాపేక్షంగా తక్కువగా ఉంటాయని ఊహించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్ర మొత్తంగా చూసినప్పుడు (ప్రపంచ యుద్ధాల వంటి అరుదైన సందర్భాలలో తప్ప) ఎప్పుడూ పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు వ్యవసాయ ఉత్పత్తుల ధరల కన్నా ఎక్కువగానే కొనసాగుతున్నాయి. రికార్డో సిద్ధాంతానికి భిన్నంగా వాస్తవ అనుభవం ఉంది.
          తనకు అవసరమైన ముడిసరుకులను కావలసిన మేరకు పొందడానికి సామ్రాజ్యవాదం ఆ సరుకులను ఉత్పత్తి చేసే దేశాల మార్కెట్లను అవసరమైతే నియంత్రిస్తుంది. వాటి ఉత్పత్తి ఒకవేళ తగ్గినా, తనకు కావలసినమేరకు వాటిని పొందడానికి వీలుగా మూడో ప్రపంచ దేశాలలో వాటి వినియోగం తక్కువ ఉండేలా చేయగలుగుతుంది. అందుకు ఇప్పుడు ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ జోక్యమూ అవసరమే లేదు. నయా ఉదారవాద విధానాలే ఆ పని చేస్తాయి. ఆ విధానాలలో అంతర్గతంగా ఇమిడివున్న షరతుల ద్వారా, ఆ యా దేశాలమీద ''పొదుపు'' చర్యలను రుద్దుతాయి. అప్పుడు అక్కడి ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుంది. దాని కారణంగా వారి వినియోగం తగ్గిపోతుంది. అప్పుడు అక్కడ మిగులు సరుకును సామ్రాజ్యవాదుల చవకగా కొనుగోలు చేయగలుగుతారు. అందుచేత రికార్డో చెప్పినట్టు ''అద్దె సరుకులు'' అనేవి ఏ దశలోనూ పెట్టుబడి పోగుబడడానికి ఆటంకంగా నిలవలేదు.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌