
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ఈడీ, ఐటీ సోదాలు అంటూ టీఆర్‌ఎస్, బిజెపిలు కలిసి ఆడుతున్న డ్రామాలని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పారు. అలాగే 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని తెలిపారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.