
సిపిఎం, రైతు సంఘాల నాయకుల అరెస్టు, విడుదల
గ్రీన్ కో నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకూ పోరాటం : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/పాణ్యం :గ్రీన్‌కో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం రైతులతో మాట్లాడేందుకు వెళ్తున్న సిపిఎం, రైతు సంఘం నాయకులను పోలీసులు బుధవారం అడ్డుకొని అరెస్టు చేశారు. పాణ్యంలో ఉదయం నుండే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివిధ మార్గాల్లో పాణ్యం చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పాణ్యం బస్టాండ్ సెంటర్‌లో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజశేఖర్, సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.నాగరాజు తదితరులను పోలీసులు అరెస్టు చేసి పాణ్యం, గోస్పాడు స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు పాణ్యం బస్టాండ్‌లో సిపిఎం నాయకులను కొందరిని అరెస్టు చేసి నందివర్గం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మధ్యాహ్నం తరువాత సొంత పూచీకత్తుపై అందరినీ విడుదల చేశారు. తొలుత ర్యాలీని ఉద్దేశించి, అరెస్టు తర్వాత పాణ్యం పోలీస్ స్టేషన్‌లో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రీన్‌కో చేపట్టే విద్యుత్తు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన పిన్నాపురం రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకూ పోరాడుతామని తెలిపారు. అభివృద్ధికి, గ్రీన్ కో ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. రైతుల పొలాలను లాక్కునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే తొలి ముద్దాయని అన్నారు. పిన్నాపురం వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడం, పోలీసులను పెట్టి నిర్బంధం ప్రయోగించడం శోచనీయమన్నారు. గ్రీన్ కో తన వెబ్ సైట్‌లో నిజాయితీ, నిబద్ధతలు పాటిస్తామని రాసుకుందని, ఇదేనా నిబద్ధత అని ప్రశ్నించారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని పోరాడిందని, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వమే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. బాధితులకు అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే మండలం మారాలని వారిని బెదిరించడం, సిఎస్‌ఆర్ ఫండ్స్ ఇప్పిస్తామని అనడం శోచనీయమన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న కంపెనీపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే తమ కార్యకర్తలను అరెస్టు చేస్తారని, తాము ఇక్కడికి వస్తే ఇక్కడా అరెస్టు చేస్తున్నారని, నిజాలను ఎంతో కాలం దాచలేరని అన్నారు. న్యాయం చేయాలని కోరుతున్న వారిని కలిసేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ప్రజలను కలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం నిరోధించలేదని, పిన్నాపురం ప్రజలను కలుసుకుంటామని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అన్నారు. అన్ని ప్రజా సంఘాల నాయకులు అండగా నిలవాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న వారందరికీ జిఒ 350 ప్రకారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులపై నిరసనలు
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కొత్త బస్టాండ్ ఎదుట సిపిఎం ఆధ్వర్యాన రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశారు మాట్లాడుతూ పిన్నాపురం ప్రజలకు సంఘీభావంగా నిలిచిన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నందికొట్కూరు, బేతంచర్ల, డోన్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు.