Jan 31,2023 20:51

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో రికీ బుయ్, కరణ్‌ షిండే బ్యాటింగ్‌లో చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తొలిరోజు గౌరవప్రద స్కోర్‌ చేయగల్గింది. వికెట్‌ కీపర్‌ రికీ బురు(115), కరణ్‌ షిండే(83) అజేయంగా నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్‌ జట్టు 2 వికెట్ల నష్టానికి 262పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌(24), అభిషేక్‌ రాయుడు(22) నిరాశపరిచారు. దీంతో ఆంధ్ర జట్టు 58పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ విహారి(15 రిటైర్డ్‌హార్ట్‌) గాయంతో మైదానాన్ని వీడినా.. మూడో వికెట్‌కు రికీ బుయ్, కరణ్‌ షిండే కలిసి ఇప్పటికే 204 పరుగులు జతచేశారు. మధ్యప్రదేశ్‌ బౌలర్‌ గౌరవ్‌ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఇతర క్వార్టర్‌ఫైనల్‌ పోటీల్లో బెంగాల్‌ బౌలర్లు చెలరేగడంతో జార్ఖండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173పరుగులకే కుప్పకూలింది. మరో క్వార్టర్‌ఫైనల్లో ఉత్కరాఖండ్‌ జట్టు 116పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ కాగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 123పరుగులు చేసింది. నాల్గో క్వార్టర్‌ఫైనల్లో సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 303పరుగులకే పరిమితం కాగా.. పంజాబ్‌ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 3పరుగులు చేసింది.