Sep 07,2023 10:51

చెన్నై : తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన ఆగి ఉన్న లారీని వ్యాన్‌ ఢకొీట్టింది. డ్రైవర్‌ నిద్రలో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్‌, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్‌ డ్రైవర్‌ విఘ్నేష్‌, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.