
ఆదిలాబాద్ : జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఉదరు కుమార్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ మదర్సా కు చెందిన ఉపాధ్యాయుడు మహ్మద్ హర్షత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాకీర్ ఖాన్, ముజాహిద్ ఖాన్, రాజస్థాన్‌కు చెందిన నసీం, జాఫర్ ఖాన్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన మహమ్మద్ సాజిద్ ఖాన్ కొన్ని రోజులుగా ఆదిలాబాద్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు.ఈనెల 13న హల్దీరాం ప్యాకెట్లతో హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న కంటైనర్ డ్రైవర్లను తుపాకులు, కత్తులతో బెదిరించి ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను శనివారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.వీరి వద్ద నుంచి రూ.4 లక్షలు విలువ చేసే హల్దీరాం ప్యాకెట్లు, రూ1. 52 లక్షలు విలువ చేసే ఫ్లిఫ్ కార్ట్ పార్సెల్, రెండు కంట్రీమేడ్ తపంచాలు, రెండు కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.