Mar 21,2023 21:48
  •  ఐక్యపోరాటాలే శరణ్యం
  •  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్న సిఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విధానాలపై వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, లౌకికవాదులు ఉద్యమించాల్సిన అవసరముందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేసుతో కలిసి విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రతిపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, లౌకికవాదులంతా ఖండించాలని, అంతా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరముందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘ ఐక్య పోరాట కార్యాచరణను ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగనున్న సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగితే పోలీసులతో దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ నిర్బంధాలకు జగన్‌ ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అంగన్‌వాడీలను పోలీస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో నిర్బంధించారన్నారు. అనారోగ్యానికి గురైన అంగన్‌వాడీలకూ అనుమతి ఇవ్వకుండా వారిపట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో వారికి అనుమతిచ్చి ఉంటే, వాళ్లంతా శాంతియుతంగా నిరసన తెలిపేవారని అన్నారు. జిఓ నెంబర్‌ 1 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే అన్ని జిల్లాల్లోని వామపక్ష, ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలే స్పీకర్‌పై దాడి చేశారంటూ అసత్యప్రచారం చేయడం తగదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో ఒక్కో నియోజకవర్గంలో 4 నుంచి 5 వేలఓట్లు దొంగ ఓట్లను వైసిపి నమోదు చేయించి, అక్రమంగా గెలుపొందిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్‌ ప్రభుత్వ పతనానికి నాంది అని స్పష్టం చేశారు.