Aug 08,2022 21:14

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంలోని మోడీ సర్కారు తీరు మారాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 543వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ ఎఫ్‌ఎమ్‌డి, ఇఎమ్‌డి, ఇఎన్‌ఎమ్‌డి, ప్లాంట్‌ డిజైన్‌ విభాగాల కార్మికులు దీక్షల్లో కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైనా ఆ ప్రభావం భారత్‌పై పడకుండా ప్రభుత్వ రంగ సంస్థలు దేశాన్ని నిలబెట్టాయని గుర్తు చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను ఏకమొత్తంగా దోచిపెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎన్‌.రామారావు, వైటి.దాస్‌, పరంధామయ్య, బూసి వెంకటరావు, మహాలక్ష్మి నాయుడు, వరసాల శ్రీనివాసరావు, రామ్‌మోహన్‌ కుమార్‌ పాల్గొన్నారు.