Jun 22,2022 22:09

న్యూఢిల్లీ: టీమిండియా మహిళా క్రికెటర్‌, వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రుమేలీ ధార్‌(38) అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలకింది. 2003-18వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రుమేలీ.. ఆల్‌ రౌండర్‌గా సేవలందించింది. బుధవారం తన రాజీనామా లేఖను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తెలిపింది. '23ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్‌ నగర్‌లో ప్రారంభమైన నా క్రికెట్‌ ప్రయాణం నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని ఫార్మాట్ల నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. భారత జట్టు తరఫున ఆడటం, 2005లో మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆడటం నేనెప్పటికీ మరిచిపోలేనివి. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబసభ్యులు, బిసిసిఐ, తోటి ఆటగాళ్లకు ధన్యవాదాలు..' అని పేర్కొంది. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌, రైల్వేస్‌, ఎయిరిండియా, ఢిల్లీ, రాజస్తాన్‌, అస్సాం క్రికెట్‌బోర్డులకు రుమేలీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. 2003లో ఇంగ్లండ్‌ పర్యటనతో టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న రుమేలీ.. చివరిసారి 2018లో ఇండియా-ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా ట్రై సిరీస్‌లో పాల్గంది. 4టెస్టుల్లో 236పరుగులు, 8 వికెట్లు.., 78వన్డేల్లో 961 పరుగులు, 63 వికెట్లు తీసిన రుమేలీ.. 18టీ20ల్లో 131పరుగులు, 13వికెట్లు పడగొట్టింది.