Jun 24,2022 06:37

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకీ వెలవెలపోతూ.. ఇదివరకెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారంనాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు పతనమై రూ.78.39కి దిగజారింది. రూపాయి చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టం. భారత స్టాక్‌ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) తరలిపోవడం, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం తదితర అంశాలు రూపాయిని బలహీనపరుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి విలువ దిగజారడంవల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల జీవన స్థితిగతులకు కలుగనున్న తీవ్ర ఇక్కట్లను తలుచుకుంటేనే భయమేస్తుంది. రూపాయి విలువ తగ్గుతున్నకొద్దీ దిగుమతుల విలువ పెరుగుతూ పోతుంది. మన దేశ అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం కనుక చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. అంతకుముందు గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. కొత్తగా అప్పులు పుట్టడమూ కష్టమే అవుతుంది. దిగుమతుల విలువ పెరిగిపోవడంతో దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. 2022 మార్చి నాటికి 190 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ వాణిజ్య లోటు 2023 మార్చికి 250 మిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తల అంచనా. 6,000 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.4.5 లక్షల కోట్ల మేర లోటు అధికమవుతుంది (ఇది ఆంధ్రప్రదేశ్‌ రెండేళ్ల బడ్జెట్‌ కన్నా ఎక్కువ.). విదేశీ వాణిజ్య లోటు పెరగడంతోపాటు ప్రభుత్వానికి ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. దాంతో ప్రజలకిచ్చే సబ్సిడీలకు, ఇతర రాయితీలకు కోతలు పెట్టడం లేదా మంగళం పాడడమో జరుగుతుంది. ఇలా ఎటు చూసినా జనానికి బాదుడే!
మన ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు వెనక్కు తీసుకుపోవడం మూలంగా రుపాయి బలహీనపడుతోందన్నది విశ్లేషకుల మాట. ఈ జూన్‌ నెలలోనే ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ.38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ వేగం మరింత పెరగవచ్చుననీ ఆర్థికవేత్తలు అంటున్నారు. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష వలయం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, ధరలు ఇంకా ఇంకా పెరగడానికే దారి తీస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశిత నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలువల్లనే దేశానికి ఈ దుస్థితి దాపురించింది.1991 నుండీ మన దేశ పాలకులు ఈ విధానాలు అమలు చేస్తున్నా నరేంద్ర మోడీ గద్దెనెక్కాక మరింత వేగవంతమయింది. ఉదాహరణకు 2014 మే నెలలో మోడీ అధికారానికి వచ్చినప్పుడు ఒక డాలరుకు 58.75 రూపాయలు కాగా ఎనిమిదేళ్ల తరువాత గడచిన బుధవారంనాడు డాలరు విలువ రూ. 78.39కి పెరిగింది. ఎనిమిదేళ్లలో డాలరుతో రూపాయి విలువ 33.2 శాతం దిగజారిందన్నమాట. ఇదీ మోడీ పాలనా ఘనత! ఇంత జరుగుతున్నా రూపాయి విలువను కాపాడడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని నమ్మబలకడం బిజెపి నేతలకే చెల్లింది. గడచిన ఆరు నెలల్లో రూపాయి విలువను నిలబెట్టడానికి రిజర్వు బ్యాంకు 4,373 డాలర్లను వెచ్చించింది. ఆ పని చెయ్యకపోతే రూపాయి ఇంకా దిగజారిపోయేది. అయితే రానున్న రోజుల్లో కరెన్సీ మార్కెట్‌లో వెచ్చించడానికి ఆర్‌బిఐ కి ఎంత వెసులుబాటు ఉంటుందో కూడా చెప్పలేం. కనుక అనిశ్చతికి తెర పడాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలను సర్కారు చేపట్టాలి. కాని, ఈ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అది తప్ప వేరు దారి లేదు.