
- అర్హత గల బిడి కార్మికులకు పక్కా ఇళ్లు
- యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ
- యాత్రకు నాలుగు రోజులు విరామం
ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్/పెద్దముడియం:వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అర్హత ఉన్న బిడి కార్మికులందరికీ ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. గురువారం వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలంలోని ఎన్.కొత్తపల్లె విడిది కేంద్రం నుంచి పెద్దపసుపుల జంక్షన్, పెద్దపసుపుల, పెద్దపసుపుల చావిడి, జమ్మలమడుగు బైపాస్ విడిది కేంద్రం వరకూ సాగింది. ఆయా ప్రాంతాల్లో ముస్లిములు, క్రిష్టియన్లు, రైతులతో మాటామంతి, ముఖాముఖి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ.. గ్రామాలకు నిధులివ్వకపోగా, గ్రామ పంచాయతీల్లోని రూ.8,660 కోట్లను సర్పంచ్‌లకు తెలియకుండా దొంగిలించారన్నారు. టిడిపి హయాంలో గ్రామాల్లో 25 వేల కి.మీ సిసి రోడ్లు, 30 లక్షల ఎల్‌ఇడి లైట్లు వేశామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కుందూనది ముంపు సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, రాజోలి ప్రాజెక్టును 2.95 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించి, నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామని హామీనిచ్చారు. కర్నూలు, అనంతపురం వంటి పెద్దాసుపత్రుల్లో కనీసం దూదికి కూడా దిక్కులేదని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తదితరులు పాల్గన్నారు.
మహానాడు కార్యక్రమం వల్ల ఈ నెల 26, 27, 28, 29వ తేదీల్లో యాత్రకు విరామం ప్రకటించినట్లు యువగళం మీడియా కోాఆర్డినేటర్ తెలిపారు. తిరిగి 30న యాత్ర పున్ణప్రారంభమవుతుందని తెలిపారు