
మాస్కో : ఆల్ రష్యన్ చైనీస్ లాంగ్వేజ్ కాంపిటీషన్ ''చైనీస్ లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్రిడ్జ్'' ఫైనల్స్‌ను మంగళవారం ఇర్కుట్స్క్ స్టేట్ యూనివర్శిటీ (ఐఎస్‌యు)లో నిర్వహించారు. ప్రాథమిక విద్యార్థుల నుండి సెకండరీ, హయ్యర్ విద్యార్థుల వరకు అన్ని వయస్సుల వారు ఈ పోటీలో పాల్గొన్నారు. చైనీయుల సంస్కృతి, చరిత్ర, భౌగోళిక అంశాలతో పాటు సాహిత్యంలో విద్యార్థుల ప్రతిభను వెల్లడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీని ప్రాంతీయ, జాతీయ (రష్యన్), అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలు చైనాలో జరగనుండగా, చైనీస్ సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేయనుంది. విజేతలు ''చైనీస్ భాష మరియు సంస్కృతికి వారసులు'' అనే బిరుదును అందుకోనున్నారు. ఆల్ రష్యన్ పోటీ అనేది జాతీయ స్థాయి రౌండ్. విజేతలు రష్యాకు అంబాసిడర్‌గా వ్యవహరించే హక్కును కలిగి ఉంటారు. అలాగే విజేతలకు చైనాలోని ఏ యూనివర్శిటీలోనైనా ఉచిత విద్యను పొందేందుకు అవసరమైన సర్టిఫికేట్‌లను జారీ చేస్తారని మాస్కో స్టేట్ యూనివర్శిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ హెడ్ స్వెత్లానా పేర్కొన్నారు.