Jan 31,2023 07:42

ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గ్యాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.

2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17 లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2 శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30 శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86 లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48 లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బ తీసేందుకు ప్రకటించిన అనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60 డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.
        పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంధన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఇంధన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ అన్నారు. రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రూ.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌...ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్ర మోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?
           నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా, బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు, మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గ్యాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.
           ప్రస్తుతం రోజుకు మన దేశం 17 లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరు లక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ధి సామర్ధ్యంలో ఇది సగం. నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ధి కంపెనీలకు ఒక ట్యాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 ట్యాంకర్లు ఉన్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలు దువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది.
           అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ధి కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలన్‌స్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ''తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంధనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ధి చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే'' అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌ లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నర రెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.
             ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41 శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది. లేనట్లయితే ఇంధన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌ లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్‌ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంధన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది. జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200 బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన, 2024 వరకు గ్యాస్‌ ధరల అదుపు వంటి పథకాలను ప్రకటించినప్పటికీీ ఇంధన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14 శాతం గ్యాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15 శాతం పడిపోయింది. గతంలో వెనిజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ధి చేసిన తరువాత దొడ్డి దారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మోడీ ప్రభుత్వం అమెరికా సేవలో తరిస్తున్నదన్నమాట !

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు