
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఇఎన్సి) నియమాకంలో దళితులను అవమానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలని టిడిపి మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులను మభ్యపెట్టి వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ వారిని నట్టేట ముంచారని విమర్శించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఇఎన్సి)గా సుబ్బారెడ్డిని నియమించడం దళితులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం ఎస్సి, ఎస్టి అధికారులకు రావాల్సిన పదవులనూ జగన్ రెడ్లకే కట్టబెడుతున్నారని విమర్శించారు. ఇఎన్సి నియామకంపై పంచాయితీరాజ్‌శాఖ ఉద్యోగులు స్పందించాలని కోరారు. జాబితాలో తొలిస్థానంలో ఉన్న బాలునాయక్‌ను కాదని ఎక్కడో ఐదోస్థానంలో ఉన్న సుబ్బారెడ్డిని నియమించడం దళితులను అవమానించడం, అణచివేయడమేనని పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి అధికారులను కాదని రెడ్లకు అగ్రతాంబూలం ఇవ్వడం అట్రాసిటీ కాదా అని ప్రశ్నించారు. ఈ నియామకం ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు.