Aug 07,2022 07:35

* ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను
* గుంటూరు,విజయవాడలో ఆలిండియా జాతా ర్యాలీ

ప్రజాశక్తి-గుంటూరు : నూతన జాతీయ విద్యావిధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై దాడి చేస్తోందని, ఎన్‌ఇపిపై రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వి.పి.సాను తెలిపారు. సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ ఇండియా, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ నినాదాలతో ఆగస్టు 1న కన్యాకుమారిలో ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ జాతా శనివారం గుంటూరు, విజయవాడలో పర్యటించింది. గుంటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భగా సాను మాట్లాడుతూ.. విద్యా రంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపిని తీసుకొచ్చిందని విమర్శించారు. ఎన్‌ఇపి అంటే రిజర్వేషన్‌, ప్రజాస్వామ్యం లేనిదని వివరించారు. రాజ్యాంగ విలువలకు ఎన్‌ఇపిలో చోటే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చేరి, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలను విలీనం చేస్తున్నారని, విలీనం అంటే అంతిమంగా మూసివేయడమేనని తెలిపారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 11 లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని,ఒక్క పోస్టును కూడా భర్తీ చేయట్లేదని అన్నారు. అగ్నిపథ్‌ పథకం దేశ రక్షణ వ్యవస్థను బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సెంట్రల్‌ కమిటీ జాయింట్‌ సెక్రెటరీ నారాయణన్‌ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, ఆస్తి, భేదం లేకుండా విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉందన్నారు. కానీ దేశంలో 67 శాతం ఉన్నత విద్యాసంస్థలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయని, అందులో సంపన్న వర్గాల పిల్లలు మాత్రమే చదవగలుగుతున్నారని తెలిపారు. ఇక పేద విద్యార్థులు వారితో ఎలా పోటీ పడగలరని, వారి ఆశలు ఎలా నెరవేరుతాయని ప్రశ్నించారు. అంబాని, అదానీల కోసమే ఎన్‌ఇపి తెచ్చారని విమర్శించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విలీనం పేరుతో పాఠశాలలను మూసివేయటం సరికాదన్నారు. టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.కిరణ్‌, పి.మనోజ్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు. అనంతరం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, వివిఐటి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో జాతా బృందం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించింది.

gnt