
ఎస్‌విబి వైఫల్యానికి ప్రధాన కారణాలు అధిక వడ్డీరేట్లు, ద్రవ్య లభ్యతలో ఇబ్బందులు. ఎస్‌విబి తక్కువ కాల వ్యవధిలో డిపాజిట్లు స్వీకరించి, వాటిని దీర్ఘకాలిక సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టింది. ఒక్కసారిగా ''రన్ ఆన్ ది బ్యాంక్'' తరహాలో, కస్టమర్లు డిపాజిట్లు వెనుకకు తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇక్కడ కస్టమర్లు అంటే వెంచర్ క్యాపిటలిస్టులు. రిటైల్ కస్టమర్లు అయితే అంత ఇబ్బంది ఉండేది కాదు. పైపెచ్చు డిపాజిటర్లలో 93 శాతం మందికి ఇన్సూరెన్స్ వర్తించదు. ఇది కూడా భయాందోళనలకు కారణం అయ్యింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్‌విబి) దివాళా తీయడంతో, అమెరికన్ మార్కెట్‌లో నెలకొన్న గందరగోళ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడింది. అందుకే ఈ ఘటన తర్వాత పలు దేశాల స్టాక్ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలను నమోదు చేశాయి. ఎస్‌విబి తరువాత సిగేచర్ బ్యాంకు, సిల్వర్‌గేట్ బ్యాంక్ పతనమవడం యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాయి.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను అమెరికాలో 16వ అతి పెద్ద బ్యాంకుగా పరిగణిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లు, టెక్ సంస్థలకు రుణాలు అందించే బ్యాంక్‌గా ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఎస్‌విబి ఫైనాన్షియల్ గ్రూప్ ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు. 1983లో ప్రారంభమైన ఈ బ్యాంక్ అమెరికాతో పాటు 10 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు తన పతనానికి ముందు అమెరికాలోని వెంచర్ సపోర్ట్ టెక్నాలజీ కంపెనీల్లో సగానికి పైగా సేవలు అందించేది. భారత్, చైనా నుండి కూడా స్టార్టప్ కంపెనీలు ఈ బ్యాంక్‌లో భారీగా డిపాజిట్లు పెట్టాయి. ఇటీవలి సంవత్సరాలలో టెక్ పరిశ్రమ వేగంగా వృద్ధి కావడంతో బ్యాంక్ ప్రయోజనం పొందింది. ఎస్‌విబి ఆస్తులు 2019 చివరి నాటికి 71 బిలియన్ డాలర్ల నుండి 2022 మార్చి చివరి నాటికి 220 బిలియన్ డాలర్లకు (దాదాపు మూడు రెట్లు) పెరిగాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, స్టార్టప్ రంగంలోని కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఎస్‌విబి లో ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించాయి. కోవిడ్ సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణం తగ్గించడానికి, ప్రజల వినిమయం పెంచడానికి అదనపు కరెన్సీని ముద్రించింది. ఇందులో హెచ్చు భాగం వెంచర్ క్యాపిటలిస్ట్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఎస్‌విబి బ్యాంక్‌లో డిపాజిట్లుగా చేరాయన్నది ఆర్థికవేత్తల మాట. ఈ కారణంగా 2017లో బ్యాంకు డిపాజిట్ పరిమాణం 3.60 లక్షల కోట్లు కాగా, 2021 చివరి నాటికి అది 15.50 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ అదే సమయంలో రుణాల పరిమాణం రూ.1.90 లక్షల కోట్ల నుంచి రూ.5.4 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. అంటే బ్యాంకు తన డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ, బ్యాంకు మొత్తం ఆదాయం కంటే చాలా రెట్లు ఎక్కువ అయ్యింది. ఎస్‌విబి డిపాజిట్లు స్వీకరించిందే తప్ప, అప్పులు పెద్దగా ఇవ్వలేదు. 2022 డిసెంబర్ నాటికి ఎస్‌విబి సగటు డిపాజిట్లు 173 బిలియన్ డాలర్లు. దీనిలో అప్పుల పోర్టుఫోలియో 74 బిలియన్ డాలర్లు. కాగా, బాండ్ల సెక్యూరిటీలలో దాదాపు 117 బిలియన్ డాలర్లు మదుపు పెట్టింది. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎస్‌విబి తన డిపాజిట్లలో ఎక్కువ భాగం ప్రభుత్వ బాండ్లలో (ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలలో) పెట్టుబడి పెట్టింది. ఎస్‌విబి ఈ విధంగా తన 55 శాతం పెట్టుబడులను అమెరికా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలలో పెట్టింది. అమెరికాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆస్తులలో దాదాపు 24 శాతం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలలో పెట్టుబడులుగా ఉన్నాయి. ఎస్‌విబి మాత్రం తన 55 శాతం పెట్టుబడులను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలలో పెట్టింది. అనేక బ్యాంకులలో ద్రవ్య లభ్యత వాటి ఆస్తులతో పోలిస్తే 13 శాతం ఉండగా, ఎస్‌విబి లో 7 శాతం, సిగేచర్ బ్యాంక్ లో 5 శాతం ఉంది.
బాండ్లను సురక్షిత పెట్టుబడిగా పరిగణించడంతో, ద్రవ్యోల్బణాన్ని చల్లబరచడానికి ఫెడరల్ రిజర్వ్ గత సంవత్సరం వడ్డీ రేట్లను పెంచనారంభించే వరకు ఈ ఆలోచన బాగా పనిచేసింది. 2022 మార్చి నుంచీ అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు 4.5 శాతం మేరకు పెరిగాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పాత బాండ్ల విలువ తగ్గుతుంది. కొత్త బాండ్లను పెరిగిన వడ్డీరేట్లతో జారీ చేస్తారు. నూతన బాండ్ల జారీ నేపథ్యంలో, పాత బాండ్లకు డిమాండ్ పడిపోయింది. పాత సెక్యూరిటీలను మెచ్యూరిటీ వరకూ ఉంచితే నష్టం లేదు. అయితే, టెక్ కంపెనీలు క్యాష్ అవసరాలకు ఎస్‌విబి నుండి డిపాజిట్లు వెనుకకు తీసుకోవడంతో ఎస్‌విబి లో ద్రవ్య లభ్యత ఇబ్బందికరంగా మారింది. వెంచర్ క్యాపిటలిస్ట్ ఖాతాదారుల డిపాజిట్ ఉపసంహరణ నేపథ్యంలో బాండ్ల విలువ పడిపోయినప్పటికీ, బ్యాంక్ తన పెట్టుబడులలో కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది. దీంతో కొద్ది రోజుల్లోనే బ్యాంకు రూ.16,000 కోట్ల మేరకు నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మార్కెట్ నుంచి రూ. 20,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడుల సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాతృ సంస్థ ఎస్‌విబి ఫైనాన్షియల్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనలు ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించాయి. ఒకే రోజులో 42 బిలియన్ డాలర్ల డిపాజిట్లను డిపాజిటర్లు వెనుకకు తీసుకున్నారు. దీంతో దాని స్టాక్ విలువ 60 శాతం పడిపోయింది. అమెరికన్ మార్కెట్‌లో అమ్మకాలు పెరగడంతో భారీ నష్టం వాటిల్లింది. దీని ప్రభావం భారత్‌తో సహా ఇతర దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఎస్‌విబి వద్ద డిపాజిటర్లకు చెల్లించడానికి తగినంత నగదు లేదు కాబట్టి కాలిఫోర్నియా రెగ్యులేటర్లు బ్యాంకును మూసివేశారు. మార్చి 10న, కాలిఫోర్నియా రెగ్యులేటర్లు బ్యాంకును స్వాధీనం చేసుకున్నారు. అన్ని డిపాజిట్లకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బాధ్యతను అప్పగించారు.
ఎస్‌విబి వైఫల్యానికి ప్రధాన కారణాలు అధిక వడ్డీరేట్లు, ద్రవ్య లభ్యతలో ఇబ్బందులు. ఎస్‌విబి తక్కువ కాల వ్యవధిలో డిపాజిట్లు స్వీకరించి, వాటిని దీర్ఘకాలిక సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టింది. ఒక్కసారిగా ''రన్ ఆన్ ది బ్యాంక్'' తరహాలో, కస్టమర్లు డిపాజిట్లు వెనుకకు తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇక్కడ కస్టమర్లు అంటే వెంచర్ క్యాపిటలిస్టులు. రిటైల్ కస్టమర్లు అయితే అంత ఇబ్బంది ఉండేది కాదు. పైపెచ్చు డిపాజిటర్లలో 93 శాతం మందికి ఇన్సూరెన్స్ వర్తించదు. ఇది కూడా భయాందోళనలకు కారణం అయ్యింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిట్లలో దాదాపు 175 బిలియన్ డాలర్లు ఇప్పుడు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) నియంత్రణలో ఉన్నాయి. ఇటీవల ఈ బ్యాంకు యు.కె విభాగాన్ని హెచ్‌ఎస్‌బిసి కొనుగోలు చేసింది. ఏం జరిగిందో పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ఈ రంగంపై నిబంధనలను కఠినతరం చేయాలని రెగ్యులేటర్లు, బ్యాంకింగ్ రెగ్యులేటర్లను కోరతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. డిపాజిట్‌దార్లకు మొత్తం డిపాజిట్ మొత్తాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. బ్యాంకు నష్టాలకు పన్ను చెల్లింపుదారుల డబ్బు బాధ్యత వహించదని, బెయిలవుట్ ప్యాకేజీని ఆయన తోసిపుచ్చారు.
అమెరికా ఎస్‌విబి పతనం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్, ఐ.టి కంపెనీల షేర్లపై ప్రభావం పడింది. అంతర్జాతీయంగా 465 బిలియన్ డాలర్ల స్టాక్స్ ఆవిరయ్యాయి. ఎస్‌విబి, సిగేచర్ బ్యాంకులు వరుసగా వారం రోజుల్లోనే కుప్పకూలడం ప్రాంతీయ అమెరికా బ్యాంకుల్లో భారీ ఆర్థిక మాంద్యం భయాలను రేకెత్తించింది. ఈ వైఫల్యాలు అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో అతి పెద్ద టాప్-3 పతనాలలో ఉన్నాయి. దీనిపై బ్యాంకింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పతనం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ షేర్లను దెబ్బతీసిందని పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో అమెరికాలో మార్కెట ్ల పతనం కొనసాగవచ్చని, దాదాపు 620 బిలియన్ డాలర్ల అప్రకటిత నష్టం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎస్‌విబి పతనం ఇతర అమెరికా బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వార్తలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. ఎస్‌విబి మాతృ సంస్థ, ఎస్‌విబి ఫైనాన్షియల్ గ్రూప్ భారతదేశంలోని బ్లూస్టోన్, కార్‌వాలెట్, ఇన్‌మోబి లాయల్టీ రివార్డ్‌లలో పెట్టుబడులను పెట్టింది. వై కాంబినేటర్, ఎస్‌విబి వినియోగదార సంస్థ, భారతదేశంలోని 19 స్టార్టప్‌లలో పాల్గొంటోంది. తద్వారా రెండో దశలో భారత్‌పై ప్రభావం పడే అవకాశాన్ని తోసిపుచ్చలేము. దేశంలో నియంత్రణా వ్యవస్థల నిర్వహణ సామర్ధ్యం వల్లే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మన దేశం సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగింది. బ్యాంకులలో ద్రవ్య లభ్యత ఎంత ఉండాలి, ఎంతమేర అప్పులు ఇవ్వాలి, మూలధనం ఎంత ఉండాలి అనే విషయాలకు సంబంధించి మన దేశంలో కఠిన చట్టాలు ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిడి మేరకు వాటిని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. అందుకే రానురాను దేశంలో నియంత్రణా వ్యవస్థల పరిధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే పరపతి రుణాలు కోతకు గురవుతున్నాయి. కార్పొరేట్ రుణాలు, అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఒక బ్యాంక్, తన పెట్టుబడులను పెద్దఎత్తున బాండ్ సెక్యూరిటీల మార్కెట్‌లో పెట్టడానికి ఆర్.బి.ఐ, నియంత్రణా చట్టాలు అంగీకరించవు. ఎస్‌విబి వైఫల్యం దృష్ట్యా భారతీయ బ్యాంకులు తమ పెట్టుబడులను ఒకే చోట కాకుండా విస్తుృత పరచాలి. ద్రవ్య లభ్యత విషయంలో మరింతగా నియంత్రణలు పాటించాలి. మన దేశ బ్యాంకింగ్ రంగంలో రిటైల్ కస్టమర్లు ఎక్కువ. కనుక, బ్యాంకులు అప్పులను కొద్ది మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు, కార్పొరేట్ సంస్థలకో కాకుండా రిటైల్ కస్టమర్లకు ఇవ్వడం ద్వారా అప్పుల పోర్టుఫోలియోను విస్తుృత పరుచుకోవాలి.
అమెరికన్ బ్యాంకింగ్ రంగ పరిణామాలు చూసైనా మన కేంద్ర ప్రభుత్వం తన ప్రయివేటీకరణ విధానాలను పున:సమీక్షించుకోవాలి. మన దేశంలో బ్యాంక్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకూ బీమా రక్షణ ఉంది. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి లో పెట్టే పొదుపుకు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ అదనంగా ఉంది. ఇది ప్రయివేటు రంగానికి వర్తించదు. అందుకే ప్రజల విశ్వాసం దెబ్బ తినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆర్‌బిఐ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే చర్యలు చేపట్టాలి. తద్వారా దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభం బారిన పడకుండా పరిరక్షించాలి. లేకపోతే, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తరహా పరిణామాలు పునరావృతం అవుతాయి.
/ వ్యాసకర్త ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు /
పి. సతీష్