
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్న సమంత హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'చెన్నై స్టోరీ' అనే పేరు ఖరారైనట్లు సమాచారం. బాఫ్టా పురస్కార గ్రహీత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విల్ మచిన్ నిర్మాత. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్ యువకుడు నిఖిల్ (వివేక్ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి అను (సమంత) పరిచయం అవుతుంది. నిఖిల్ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్ కల్రా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నై, బ్రిటన్‌లో ఉంటుందని తెలుస్తోంది. సమంత నటిస్తున్న తొలి ఇంగ్లిష్ చిత్రమిది. ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.