
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఉద్ధవ్ థాకరే వర్గ నేత, శివసేన ఎంపి సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) 10 గంటల పాటు ప్రశ్నించింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు దక్షిణ ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఇడి కార్యాలయానికి చేరుకున్న ఆయన... రాత్రి సుమారు 9.30 గంటలకు బయటకు వచ్చారు. ఇడి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో శివసేన శ్రేణులు చేరుకోవడంతో భారీగా పోలీసులను మోహరించారు. రోడ్లపై బారీకేడ్లను ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం రౌత్ మాట్లాడుతూ... దర్యాప్తు సంస్థకు తాను సహకరిస్తానని అన్నారు. 'దర్యాప్తు చేయడమే ఇడి విధి. ఆ ఏజెన్సీ విచారణకు సహకరించడం నా విధి. నన్ను పిలిచినందుకే ఇక్కడికి వచ్చా. ఇడికి సహకరిస్తూనే ఉంటా' అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని పాత్రచాల్ అభివఅద్ధి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో సంజరు తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏప్రిల్‌లో ఇడి జప్తు చేసింది. ఆయన భార్యపేరు మీదున్న అలీబాగ్‌లోని ఎనిమిది స్థలాలు, ముంబయిలోని దాదర్ సబర్బన్‌లో ఒక ఫ్లాట్‌ను అటాచ్ చేసింది. ఈ కేసులో సంజరు రౌత్‌ను విచారించేందుకు ఇడి సిద్ధమైంది. మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత.. ఆయన ఇడి నుండి నోటీసులు అందుకోవడం గమనార్హం.