Aug 05,2022 19:53

ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 14, 15 తేదీల్లో వేలాది మంది కార్మికులతో 36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 540వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఎస్‌ఎంఎస్‌ా2 విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు బి.మురళీరాజు, మంత్రి రాజశేఖర్‌, వరసాల శ్రీనివాసరావు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను కేంద్రం విరమించే వరకు వినూత్న రీతిలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్లాంట్‌ అభివృద్ధికి గత 30 ఏళ్లుగా కార్మిక వర్గం శ్రమించి, ఉక్కు ఆస్తుల విలువ రూ.3.5 లక్షల కోట్లకు పెంచిందని తెలిపారు. గత ఏడాది రూ.944 కోట్ల నికర లాభాలను ఆర్జించి రూ.28 వేల కోట్ల టర్నోవర్‌ సాధించిందన్నారు. కరోనా సమయంలో ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 కోట్ల నికరలాభం సాధించిందని గుర్తు చేశారు. కరోనా వల్ల 150 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ఉత్పత్తి ఆపకుండా అనేక ఆసుపత్రులకు వేల టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ అందించిందని గుర్తుచేశారు. ఇలాంటి పరిశ్రమను అదానీకో, అంబానీకో అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కార్మికుల ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించడమే కాక ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ ప్లాంటును నష్టాల ఊబిలోకి నెట్టి ప్రయత్నాన్ని యాజమాన్యం చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ దీక్షా శిబిరంలో ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు కోరాడ వెంకట్రావు, మరిడయ్య, జగదీష్‌, సాయి, రాజు పాల్గొన్నారు.