Nov 20,2022 09:02

భూ మండలంలో అనేక జీవరాశులు తమ మనుగడను సాగిస్తున్నాయి. అయితే, ఒక్కో జంతు జాలానిది ఒక్కో జీవన్మరణ పోరాటం. క్రూరమృగాల నుంచి శాఖాహారుల వరకూ ఒక్కోదానికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది. వాటి వాటి రక్షణ కోసం ఒక్కో జీవికీ ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. అందులో భాగంగా కొమ్ములు, ముళ్లు, రెక్కలు, విషపు గ్రంథులు ఇలా ఉంటాయి. అయితే మనం నిత్యం చూస్తున్న జీవుల్లోనూ అప్పుడప్పుడూ కొన్ని వైవిధ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ముళ్లపంది, జింక, పాము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. అయితే సమస్త జీవరాశుల్లో కాస్త విభిన్నమైనది ఏదైనా ఉందంటే అంది 'సాలీడు' అని చెప్పుకోవచ్చు. దీనికున్న టాలెంట్‌ యూనిక్‌. దీనిని పోలిన మరేదైనా జీవరాశి ఉండటం చాలా అరుదు. చెట్లపైన, భవంతులపైన ఎక్కడైనా ఇది మనుగడ సాగించగలదు. దొరికిన కొద్ది స్థలంలో సాలిగూడు నిర్మించుకుని హాయిగా జీవిస్తుంది. సాలీడు గురించిన మరిన్ని విశేషాలు..
ఈ భూ మండలంలో ఎన్ని జీవులున్నా.. సాలీళ్లు మాత్రం కాస్త ప్రత్యేకమైనవి. మన ఇళ్లలో కనిపించే చిన్న సాలీళ్ల దగ్గర నుంచి దట్టమైన అడవుల్లో నివసించే పెద్ద పెద్ద సాలీళ్లు, జైయింట్‌ సాలీళ్లు ఇలా అనేకం ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సాలీడు మాత్రం వాటన్నింటికీ కాస్త భిన్నం. అయితే సాలీళ్లకు సాధారణంగా మూడు జతల కాళ్లు ఉంటాయని మనందరికీ తెలుసు. చైనా అడవుల్లో ఎక్కువగా కనిపించే 'హార్న్‌ స్పైడర్స్‌'కు కూడా మిగతా వాటి మాదిరే.. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే ఆరు కాళ్లు ఉంటాయి. కానీ, మధ్యలోని కాళ్లు మాత్రం జింక కొమ్ముల మాదిరిగా పెరుగుతాయి. విశేషం ఏంటంటే.. ఈ జాతి ఆడ సాలీళ్లకు మాత్రమే ఈ విధమైన ప్రత్యేకత ఉంటుందట.

spyder


మూడు రెట్ల పొడవు..
ఆడ 'హార్న్‌ స్పైడర్స్‌' సాధారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. కానీ, వాటి కొమ్ములు మాత్రం 24 నుంచి 27 మిల్లీమీటర్ల వరకూ పెరుగుతాయి. అంటే.. దాదాపు మూడు రెట్ల పొడవన్నమాట. వీటి శరీరం పైన ఉండే డొప్ప మగవాటి కంటే భిన్నంగా రకరకాల రంగుల్లో ఉంటుందట. మన దగ్గర కూడా అక్కడక్కడా కనిపించే ఈ రకం సాలీళ్లకు ఈ కొమ్ములు ఎందుకున్నాయో.. సరైన కారణం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. బల్లులు, పక్షులు లాంటి జీవుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఈ కొమ్ముల నిర్మాణం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ సూదిలాంటి నిర్మాణాలు ఉంటే.. వేరే జంతువులు తినడం కూడా కష్టం కదా! మగ సాలీళ్లు మాత్రం గరిష్ఠంగా రెండు మిల్లీమీటర్ల వరకే పెరుగుతాయట. రంగుతో సంబంధం లేకుండా.. అన్ని ఆడ సాలీళ్లకు పదునైన కొమ్ములు లాంటి నిర్మాణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇవి విషపూరితం కాకపోయినా.. ఆత్మరక్షణకు మాత్రం కొమ్ములను ఉపయోగిస్తాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ చెప్పలేదు కదూ.. వీటిని 'విష్‌బోన్‌ స్పైడర్స్‌' అని కూడా పిలుస్తుంటారు.

spyder

 

  • భారత్‌లోనూ అరుదుగా..

దీనికి మూడు వెన్నెముకలు ఉంటాయి. అవి కూడా మామూలుగా వీపు మీద కాకుండా, కడుపు భాగంలో ఉంటాయి. ఈ జాతి సాలీళ్లు పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చైనా, ఆగేయాసియా అడవుల్లో కనిపిస్తాయి. భారత్‌లోనూ కొన్నిచోట్ల ఇవి అరుదుగా కనిపిస్తాయి.

spyder
  • దాడుల నుంచి రక్షణ కోసం..

పక్షులు, బల్లుల దాడుల నుంచి తప్పించుకోవడానికే వీటికి ఆ కొమ్ములు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇవి మనుషులకు ఏమాత్రం హాని చెయ్యవు. మనుషులకు హాని కలిగించే విషపదార్థాలేవీ వీటిలో లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

spyder
  • క్షణాల వ్యవధిలో..

సాలీడు చేసే విన్యాసాల గూర్చి తెలియనివారు ఉండరు. సన్నని దారం మాదిరి వెబ్‌ వదులుతూ పైకి కిందకూ పరుగులు పెడుతుంది. ఇంజినీర్‌ డిజైన్‌ చేసిన మాదిరి సులువుగా తన గూడును షడ్బుజి ఆకారంలో అల్లేస్తుంది. నాలుగుమూలలా సపోర్టు ఉంటే చాలు ఊయల మాదిరి నెట్‌ తయారుచేసేస్తుంది. ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే పూర్తిచేస్తుంది. చాలా సందర్భాల్లో సాలీళ్లు చెట్ల మీద లేదా చీకటి గదిలో గూళ్లు కట్టుకుని, జీవిస్తుంటాయి.