May 28,2023 06:25

దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలవాల్సిన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవాన్ని ఏకపక్ష వ్యవహారంగా మార్చడం ప్రధాని నరేంద్రమోడీకే చెల్లింది. ఇరవైకి పైగా ప్రతిపక్షాలు హాజరు కాబోమని ప్రకటిస్తే కనీసం సంప్రదింపులకు కూడా ప్రయత్నించని అప్రజాస్వామిక పోకడలు దేశం ఎప్పుడూ చూసివుండదు. ఈ మధ్యనే లోక్‌సభ మాజీ కార్యదర్శి పిడిటి ఆచారి ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు ఆయనో మాట చెప్పారు. నెహ్రూ హయాంలోనూ తర్వాత చాలా కాలం కూడా పార్లమెంటులో ఉద్రిక్తత వస్తే ప్రతిపక్ష నాయకులను పిలిచి చర్చించి ఏదో ఒక పరిష్కారం చేసేవారట. ఎందుకంటే సభ జరిగేలా చూడటం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని బాధ్యత.కర్తవ్యం కూడా. మోడీ హయాంలో పార్లమెంటును ఒక తంతులాగా మార్చి పెత్తనం చేయడమే గాని ఎన్నడూ రాజ్యాంగం, సంప్రదాయం రీత్యా వ్యవహరించింది లేదు. కీలకమైన కాశ్మీర్‌ అంశం లాటిదాన్ని కూడా హఠాత్తుగా తెచ్చి మమ అనిపించడం తప్ప ముందుగా చర్చించే సాహసం ప్రజాస్వామ్య స్పృహ లేవు. నోట్ల రద్దు, ఎన్‌ఆర్‌సి వంటివాటిపై చర్చలకే అవకాశమివ్వని నిరంకుశత్వం ఈ సర్కారుది. అదే ఇప్పుడూ ప్రత్యక్షమవుతున్నది. అసలు న్యూ విస్తా పేరుతో నూతన భవన సముదాయాన్ని కట్టాలన్న నిర్ణయమే ఏకపక్షమైంది. దేశమంతా కరోనా మహమ్మారితో కలవరపడుతున్నప్పుడు తీసుకున్నది. చారిత్రకంగా కొనసాగుతున్న గొప్ప నిర్మాణాల స్థానంలో తన ముద్ర కోసమే అవసరం లేకున్నా లూట్యాన్స్‌ ఢిల్లీని మోడీస్‌ ఢిల్లీగా మార్చడమే ఏకైక లక్ష్యంగా ఈ తతంగం తలపెట్టారు. కోర్టులలో కేసులూ నడిచాయి. సాంకేతిక కారణాలతో అనుమతి సంపాదించి పూర్తి చేశారు. నూతన భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిష్టాపన కూడా ఇలాగే హఠాత్తుగా ఒంటరిగా కానిచ్చేశారు. ఆ సింహాలు గతంలో వలె గంభీర ప్రసన్నంగా గాక క్రోధంగా వుండటం మరో చర్చకు దారితీసింది. దానిపై విమర్శల తర్వాత పూర్తిస్థాయి ప్రారంభోత్సవానికైనా పునరాలోచించుకొని అందరినీ కలుపుకుపోయే బదులు దీనికీ తనే ఏకైక కర్త కర్మ క్రియగా కానిచ్చేయడం మోడీకే చెల్లింది!

  • రాష్ట్రపతి రాజ్యాంగ పాత్ర

పార్లమెంటు అంటే అన్నిపార్టీల సభ్యులూ వుండే వేదిక. రాజ్యసభ అయితే రాజ్యాంగ పరంగా రాష్ట్రాల సభ.కాని మోడీ సర్కారు దీనిని కేవలం ప్రభుత్వ వ్యవహారంగా మార్చేసింది. కాని ఇప్పుదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శ వచ్చింది ప్రతిపక్షాల గురించి కాదు. రాష్ట్రపతి గురించి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ఏర్పాటుకు, ప్రారంభానికి, ప్రోరోగ్‌ (నిరవధిక వాయిదా) కు ఎన్నికలకూ కర్త రాష్ట్రపతి. రాజ్యాంగంలో 3,111,274 అధికరణాలు రాష్ట్రపతి అధికారాలను స్పష్టంగా పేర్కొంటున్నాయి. 79వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి, సభ్యులు కలిస్తేనే పార్లమెంటు. పార్లమెంటు ఏర్పాటు ,గడువు ముగిసిన తర్వాత లేదా ప్రభుత్వం కోరితే పడిపోతే మళ్లీ కొత్త సభ ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు అనుమతి నివ్వడం రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. ఎన్నికైన సభ్యుల జాబితాను తనకే అందజేస్తారు. 78వ అధికరణం మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తేనే శాసనాలవు తాయి. కనక రాష్ట్రపతికీ పార్లమెంటుకూ మధ్య సంబంధం విడదీయరానిది. అలాటి రాష్ట్రపతి లేకుండా, కనీసం ఆహ్వానించకుండా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలనుకోవడం ఎలాటి ప్రజాస్వామ్య సంప్రదాయం? ఎలాటి రాజ్యాంగ గౌరవం? పైగా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తొలి ఆదివాసి మహిళ ఎన్నికగా గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఆమెను గౌరవించడం లేదు? ఈ మాట అనగానే అయితే ప్రతిపక్షాలు ఎందుకు ఆమెపై అభ్యర్థిని పెట్టాయని కొందరు ఎదురు దాడి చేయడం మరీ విడ్డూరం.
ఆ స్థానంలో ఎవరుంటే వారు రాజ్యాంగ రీత్యా ఆ గౌరవానికి అర్హులు తప్ప ఎన్నికల్లో పోటీ పెట్టడం ఇక్కడ సమస్య కానేకాదు. ఇంకా కొంతమంది ఉదాహరణకు తెలంగాణ పాండిచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌గా వున్న తమిళిసై సౌందరరాజన్‌ వంటివారు సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్మమంత్రి కెసిఆర్‌ తనను ఆహ్వానించలేదని పోటీ వాదన తెస్తున్నారు.సచివాలయానికి గవర్నర్‌కు మధ్య అలాటి పాత్ర వున్నట్టు రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా?తలాతోక లేని వాదన తప్ప! ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ల నిర్వాకాలను సుప్రీం కోర్టు తప్పు పట్టిన తర్వాత కూడా బిజెపి నియమిత వ్యక్తుల తీరు మారలేదనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

  • ఐక్యనిరసనలో ఎపి అపశ్రుతి

20 కి పైగా ప్రతిపక్షాలు కొత్త పార్లమెంటు ప్రారంభ వేడుకను బహిష్కరించాలని నిర్ణయించడం ప్రతిపక్ష ఐక్యతకూ బిజెపి నిరంకుశ మతతత్వ రాజకీయాలపై పెరుగుతున్న వ్యతిరేకతకూ అద్దం పట్టింది. ఇటీవలే కర్ణాటక ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన ఆ పార్టీ జాతీయ స్థాయిలోనూ తీవ్ర వ్యతిరేకతకు గురవుతున్నట్టు స్పష్టమైంది. అయితే మరోవైపున పార్లమెంటు భవనం అనేది రాజకీయాలకు అతీతమైన విషయమన్నట్టు దాన్ని బహిష్కరించడం అపచారమన్నట్టు ఒక పల్లవి లంకించుకున్నారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధాని ప్రారంభిస్తే తప్పేమిటని కొందరు మీడియా వ్యాఖ్యాతలు కూడా వంతపాడుతున్నారు. ముందే చెప్పినట్టు రాష్ట్రపతిని దేశాధినేత అనీ ప్రధానిని ప్రభుత్వాధినేత అనీ అంటారు. దేశ గౌరవానికి సంబంధించిన సందర్భాలలో రాష్ట్రపతిని ముందు నిలపడం ఆనవాయితీ. ఎందుకంటే ఆయనను లేదా ఆమెను పార్లమెంటు ఉభయ సభలూ ఎన్నుకుంటాయి. అన్ని రాష్ట్రాల ఎంఎల్‌ఎలు ఓటింగులో పాల్గొంటారు. ఎన్నికైన సభ్యులందరూ పాల్గొనే ఈ ఎన్నిక దేశసమైక్యత కోణంలో కీలక పాత్ర వహిస్తుంది. కనుకనే రాష్ట్రపతిని గౌరవించడం రాజ్యాంగాన్ని గౌరవించడమవుతుంది. ఆ మర్యాద పాటించని మోడీ ప్రభుత్వాన్ని వదిలేసి బహిష్కరిస్తున్న ప్రతిపక్షాలపై దాడి ఎక్కుపెట్టడం తలకిందులు తర్కం. ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, మాజీముఖ్యమంత్రి చంద్రబాబుల వైసిపి టిడిపి పార్టీలు రెండూ మోడీకి వత్తాసునివ్వడం హాస్యాస్పదం. జాతీయ రాజకీయాలపై ఎప్పుడూ పెదవి మెదపని జగన్‌ ఈ విషయంలో మాత్రం తలకెత్తుకుని ఇలాటి సందర్బాన్ని రాజకీయ భేదాలకు అతీతంగా అన్ని పార్టీలూ పాలుపంచుకోవాలని ప్రతిపక్షాలకు ఉచిత సలహా ఇవ్వడం గమనించదగినది. ఇటీవలే మోడీ విజన్‌ను విధానాలను పొగిడి తరించిన చంద్రబాబు కూడా డిటోగా ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా అధికారం కోసం పోటీ పడే రెండు ప్రధాన పార్టీలు బిజెపికి మద్దతు పలకడం వారి స్వామి భక్తినే చెబుతుంది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో గతంలో చాలాసార్లు అవకాశవాదంగా వ్యవహరించిన బిఎస్‌పి మాయావతి, కర్ణాటకలో లోగడ జట్టుకట్టిన జెడిఎస్‌ దేవగౌడ కూడా కోరికోరి హాజరవుతున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వంటివారు ఎప్పుడూ అదే మాటతో వున్నారు. ఇలాంటి వైఖరి లౌకిక విలువల కోసం జరిగే రాజ్యాంగ గౌరవం కోసం జరిగే పోరాటంలో ఒక అపశ్రుతి.

  • ఎక్కడిదీ రాజదండం?

మిగిలిన అనేక మతతత్వ పోకడలు నిర్ణయాలు పక్కన పెట్టి ఈ ప్రారంభోత్సవంలోనూ మోడీ ప్రభుత్వం మతరాజకీయాలనే ప్రదర్శిస్తున్నది. హిందూత్వ సిద్ధాంత కర్త గాడ్సే గురువు సావర్కర్‌ జయంతి నాడు ఈ ప్రారంభోత్సవం పెట్టడం వ్యూహాత్మక సంకేతమే. రాజదండం(సెంగోల్‌) ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. గతంలో ఎన్నడూ పెద్దగా చెప్పుకోని ఈ రాజడండం కథను తవ్వి తీయడం ద్వారా బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తున్నది.1947 ఆగష్టు 15న బ్రిటిష్‌ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడి జరిగేప్పుడు తమిళనాడులోని తిరువాదుతరై అధీనం అనే మఠం నుంచి ఈ రాజదండం కానుకగా సమర్పించబడింది. దాన్ని ఆ ఆశ్రమ ప్రతినిధులు ప్రధాని నెహ్రూకు అందిస్తున్న చిత్రాలు కూడా ఆనాడు వచ్చాయి. అయితే అదేదో స్వాతంత్ర సాధనకు అధికార మార్పిడికి సంకేతంగా ఇచ్చినట్టు పేర్కొనే ఆధారాలే లేవు. అలా చూసిన చెప్పిన సందర్భాలూ లేవు. హోంమంత్రి అమిత్‌ షా అకస్మాత్తుగా దీన్ని ప్రస్తావించినపుడు నాయకులూ పాత్రికేయులూ కూడా ఆశ్చర్యపోయారు.
అధికార మార్పిడికి ఏదైనా లాంఛనప్రాయమైన సంకేతం వుంటుందా అని మౌంట్‌ బాటన్‌అడిగితే నెహ్రూ మొదటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీని సంప్రదించినట్టు ఆయన తమ స్వరాష్ట్రమైన మద్రాసు నుంచి దాన్ని తెప్పించినట్టు అమిత్‌షా కథచెబుతున్నారు. ఈ రాజదండాన్ని మొదట మౌంట్‌బాటన్‌కు ఇచ్చి తర్వాత నెహ్రూకు అందజేశారని కథ చెబుతున్నారు. దాన్ని పార్లమెంటు భవనంపై శాశ్వతంగా ప్రతిష్టించుతామని కూడా కేంద్రం ప్రకటించింది. బ్రిటిష్‌ చక్రవర్తితో సహా దేశదేశాల రాజులు పట్టాభిషేకాల సమయంలో ఈ తరహా దండం ఒకటి రాజగురువు నుంచి తీసుకునే పద్ధతి వుంది. కాని అది ప్రజాస్వామంలో ప్రజల ఆమోదం తప్ప అలాటి ఆచారాలేమీ వుండవు. పైగా లౌకిక విధానం తీసుకున్న భారతదేశంలో అసలే అవకాశం లేదు. భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో ఒక మతానికి సంబంధించిన చిహ్నమే ఎలా ప్రభుత్వ చిహ్నమవుతుంది? అంటే ఇది కూడా బిజెపి మార్కు మత రాజకీయాలలోనూ తమిళనాడును సంతోషపెట్టే వ్యూహంలోనూ భాగమనుకోవాలి. కర్ణాటక దెబ్బ తర్వాత దక్షిణాదిలో పూర్తిగా ఖాళీ అయిన బిజెపి ఆ కోణంలోనూ ఈ పని చేస్తుండవచ్చు. దీనికి ఆధారాలేమంటే ఆనాడు వెలులవడిన ప్రత్యేక సంచికలలో వుందంటున్నారు. తీరా చూస్తే వాటిలోనూ ఆ మఠం ప్రతినిధులు చెప్పిందే వుంది. కనక ఇది కల్పితమనేది సుస్పష్టం. రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చిన ప్రాతినిధ్య స్వభావాన్ని, దానిలో భాగంగానూ రాజ్యాధినేతగానూ రాష్ట్రపతి స్థానాన్ని మోడీ సర్కారు అగౌరవం పాలు చేసింది. రాజ్యాంగంలో ఏ ప్రస్తాన లేని ఒక రాజదండాన్ని ఆ స్థానంలో ప్రతిష్టించడం దాని రాజరిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మోడీ ఏకపక్ష నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది.

RAVI

 

 

 

 

తెలకపల్లి రవి