Mar 19,2023 21:50

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :బిజెపి పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణకు విఘాతం కలుగుతోందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం లౌకికవాదులంతా మౌనం వీడాల్సిన అవసరం ఆసన్నమైందని ఆవాజ్‌ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌ అన్నారు. 'మతోన్మాదం- ప్రజాస్వామ్యం' అంశంపై కర్నూలు మౌర్య ఇన్‌ వద్ద ఇంటర్నేషనల్‌ హాల్లో ఆదివారం సదస్సు జరిగింది. ఆవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎ సుభాన్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో గఫూర్‌ మాట్లాడుతూ లౌకికవాదులంతా ఐకమత్యంగా లేకపోతే బిజెపి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుందన్నారు. బిజెపి బలపడేందుకు ముస్లిములను, క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటుందని చెప్పారు. చంద్రబాబు, జగన్‌, పవన్‌ బిజెపి చేతుల్లో కీలుబమ్మలా ఉన్నారన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎపిలో సెక్యులర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. వార్డు, గల్లి స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకొని సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని, ప్రధానంగా యువకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జగన్‌ ప్రభుత్వంలో ముస్లిములకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. ఈ సమావేశంలో ఆవాజ్‌ ఓల్డ్‌ సిటీ కమిటీ గౌరవ అధ్యక్షులు ఇస్మాయిల్‌, నగర కార్యదర్శి ఎస్‌ఎండి షరీఫ్‌, న్యూసిటీ నాయకులు ఎస్‌ఎండి రఫీ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.