Sep 21,2022 12:02

లాహోర్‌ : పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ దేశద్రోహం అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కొత్త ఆర్మీ చీఫ్‌ నియామకంపై లండన్‌లో వున్న నిందితుడైన తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ను సంప్రదించినందుకు ఆయన ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశద్రోహ అభియోగాల కింద ప్రధానిని విచారించాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ మెజారిటీ ఓటుతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆరవ అధికరణ (దేశద్రోహం) కింద ప్రధానిని విచారించాలని పంజాబ్‌ పార్లమెంటరీ మంత్రి బషరత్‌ రాజా తీర్మానంలో కోరారు. పదవీచ్యుతుడై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అయిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌, దాని మిత్రపక్షం పిఎంఎల్‌క్యులతో కూడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో పంజాబ్‌లో వుంది. తన సోదరుడితో ఇలా చర్చలు జరపడం ద్వారా, సంబంధం లేని వ్యక్తులతో సున్నితమైన అంశాలను పంచుకోరాదన్న ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని, పైగా ఇది సైన్యాన్ని అవమానించడమేనని ఆ తీర్మానం పేర్కొంది. రాణి ఎలిజబెత్‌ అంత్యక్రియల కోసం ప్రధాని షెబాజ్‌ లండన్‌ వెళ్ళారు. అక్కడ ఆయన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌తో భేటీ అయి దీనిపై చర్చించారు.