Sep 29,2022 21:39
  •  బ్రహ్మోత్సవాల కవరేజ్‌ పూర్తి చేసుకుని వస్తుండగా ఘటన

ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు మబ్బు గోపాల్‌ రెడ్డి (77) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కవరేజ్‌ పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా తిరుపతి మొదటి ఘాట్‌ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢకొీనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన ఎఎన్‌ఐలో విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం కరకంబాడిరోడ్డులోని గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఇఒ ధర్మారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, మాజీ ఎంపి చింతామోహన్‌, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి వలిగళం గోపి, జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌, సురేంద్రబాబు, తులసిరామ్‌, శ్రీను తదితరులు నివాళులర్పించారు.
గోపాల్‌రెడ్డి మృతి పట్ల చంద్రబాబు సంతాపం
గోపాల్‌రెడ్డి మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సంతాపం తెలిపారు. ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించే కలం యోధుడు గోపాల్‌రెడ్డి అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం తిరుపతి జర్నలిస్టు వర్గానికి తీరని లోటు అని పేర్కొన్నారు.