Jun 21,2022 18:12

న్యూఢిల్లీ  : వరుసగా రెండోరోజూ స్టాక్‌మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 934 పాయింట్లు లాభపడి 52,532 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 289 పాయింట్లతో 15,639 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల స్పందనలు కనిపించడంతో దేశీయ సూచీలకు కూడా ఉపశమనం లభించిందని నిపుణులు పేర్కొన్నారు. గతవారం సుమారు అన్ని షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రముఖ కంపెనీల షేర్లు కూడా వాటి విలువలో 25 శాతం కోల్పోయాయి. దీంతో షేర్లు కనిష్టాల వద్ద అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆశక్తి చూపారు. అలాగే ఆసియా-పసిఫిక్‌, అమెరికా ఫ్యూచర్స్‌ లాభాల్లో డ్రేడవుతున్నాయి. ఈ పరిణామాలు మార్కెట్లు లాభాల బాట పట్టేందుకు దోహదం చేశాయి.

అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ రేట్ల పెంపుదల ప్రపంచమాంద్యానికి దారితీస్తుందనే ఆందోళనలు కూడా అలాగే ఉన్నాయి. ప్రధాన సూచీలతోపాటు అన్ని రంగాల సూచీలూ మెరిశాయి.  పిఎస్‌బి, మెటల్‌, ఎనర్జీ(ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌) సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి.  సెన్సెక్స్‌ సూచీలైన టైటాన్‌ , ఎస్‌బిఐ, టిసిఎస్‌, హెచ్‌సిఎల్‌, టెక్‌, డా.రెడ్డీస్‌, టాటా స్టీల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, ఐటిసి, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌ టి, ఎన్‌టిపిసిలు లాభాలు పొందాయి. ఈ షేర్లు 2.8 శాతం నుంచి 6 శాతం మధ్య లాభాలతో ముగిశాయి.  అయితే నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.