
సెన్సెక్స్ 934 పాయింట్ల వృద్థి
ముంబయి : ఇటీవల వరుస నష్టాలతో భారీగా పడిపోయిన సూచీల విలువ నేపథ్యంలో మంగళవారం మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బిఎస్ఇ సెన్సెక్స్ 934 పాయింట్లు లేదా 1.81 శాతం పెరిగి 52,532.07కు చేరింది. ఓ దశలో 1200 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 289 పాయింట్లు లేదా 1.88 శాతం ఎగిసి 15,638 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్ కావడంతో భారత మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు భారీగా పెంచనున్నాయని ఆందోళనలు ఉన్నప్పటికీ మార్కెట్లు రాణించాయి. ప్రభుత్వ రంగ సూచీలు, లోహ, ఇంధన రంగాలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.4 శాతం, 3 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటన్ కంపెనీ, హిందాల్కో, జెఎస్డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్బిఐ, ఒఎన్జిసి, టిసిఎస్, ఐచర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు అధికంగా 2.5 శాతం నుంచి 6 శాతం మేర లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు నెస్ట్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ సూచీలు మాత్రం స్వల్పంగా 0.1 శాతం చొప్పున నష్టపోయాయి.