
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సిఎం జగన్మోహన్రెడ్డి విశాఖ కేంద్రంగా పాలన సాగించనున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎపి హైకోర్టు తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీం వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, ఆయన తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయని, అందువల్లే తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని చెప్పారు. శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఉందని అప్పుడే చెప్పామన్నారు.