Aug 05,2022 19:19

ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన తాజా చిత్రం 'సీతారామం'. తెలుగులో 'మహానటి' చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్‌. ఈ చిత్రం తర్వాత ఆయన మలయాళంలో నటించిన చిత్రాల్ని సైతం తెలుగులోకి డబ్‌ చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 'సీతారామం' చిత్రం విడుదలకు ముందే.. ట్రైలర్‌, సాంగ్స్‌తో.. భారీ అంచనాల్ని పెంచేసింది. ఆగస్టు 5న విడులైన ఈ చిత్రం మరి ప్రేక్షకుల అంచానాల్ని అందుకుందో లేదో తెలుసుకుందామా..?!

కథంటంటే...
ఇండియన్‌ ఆర్మీ లెఫ్టినెంట్‌ అధికారి రామ్‌ (దుల్కర్‌ సల్మాన్‌) ఓ అనాథ. కాశ్మీర్‌లో ప్రాణాలెదురొడ్డి మరీ ఓ మిషన్‌ని కంప్లీట్‌ చేస్తాడు. ఆ మిషన్‌ తర్వాత రేడియోలో అతని ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో తనకంటూ ఎవరూ లేరని చెప్పడంతో.. అతనికి వరుసగా ఉత్తరాలు వస్తుంటాయి. ఆ ఉత్తరాల్లో ఫ్రమ్‌ అడ్రస్‌ లేకుండా సీత (మృణాల్‌ ఠాకూర్‌) అనే అమ్మాయి రాసిన ఉత్తరంతో రామ్‌ ప్రేమలో పడిపోతాడు. ఆ ఉత్తరం రాసినామెను వెతుక్కుంటూ వెళతాడు. అనుకోకుండా ఆ ఉత్తరాన్ని రాసిన ఆమెను కలవడం, ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే ఓసారి ఆపరేషన్‌లో చిక్కుకున్న రామ్‌.. చివరిసారిగా సీతకు ఓ లేఖ రాస్తాడు. ఆ లేఖ పాకిస్తాన్‌లో చిక్కుకుపోతుంది. 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ ఆర్మీ అధికారి (సచిన్‌ ఖేడ్కర్‌) మనవరాలు అఫ్రిన్‌ (రష్మిక)ను సీతకు ఈ లేఖను దొరుకుతుంది. ఆ లేఖను సీతకు అందజేయడం తన చివరి కోరికని, ఆ ఉత్తరాన్ని చేర్చితేనే తన ఆస్తిలో భాగం దక్కుతుందని వీలునామాలో రాస్తాడు. దీంతో ఆస్తి కోసం అఫ్రిన్‌ రామ్‌ రాసిన లేఖను తీసుకుని బయలు దేరుతుంది. అయితే ఆ లేఖను .. సీతకు అందజేస్తుందా? ఆ ఆపరేషన్‌లో రామ్‌కి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

4567


విశ్లేషణ
ఈ చిత్రం ట్రైలర్‌తోనే సినిమాపై ఇంట్రెస్ట్‌ పెరిగింది. ఉత్తరాల ద్వారా ప్రేమ.. అది కూడా యుద్ధం నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ కావడంపై సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక సినిమా విషయానికొస్తే.. పాకిస్తాన్‌ తీవ్రవాదులు కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించడంతో కథ ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌ తీవ్రవాదుల్ని తిప్పికొట్టడంలో మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన రామ్‌ అనాథని తెలియడంతో.. ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. అందులో కథలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించేలా ఓ ఉత్తరం రామ్‌కి అందడం.. అది తన మనసుని తాకడం.. ఆ లెటర్‌ ఎక్కడి నుంచని వెతకడంతో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రేక్షకులు కూడా రామ్‌ పాత్రతో ట్రావెల్‌ అవుతారు. ఓసారి హైదరాబాద్‌లో సీతను చూడడం.. మాట్లాడుకోవడం.. ఆ తర్వాత వారి లవ్‌ట్రాక్‌ బాగుంది. అయితే ఫస్టావ్‌ కొంత సాగదీతగా అనిపిస్తుంది. కానీ... విరామానికి ముందే వచ్చే ట్విస్ట్‌ హైలెట్‌. ఈ ట్విస్టే.. సెకండాఫ్‌ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలిగిస్తుంది. ఇక సెకండాఫ్‌లో.. యుద్ధానికి, ప్రేమకి లింక్‌ పెట్టి కథనాన్ని నడిపించడం, వీరి ప్రేమకి విలన్‌గా విష్ణుశర్మ (సుమంత్‌) నిలవడంతో అతని నటనలోని మరో కోణాన్ని తెలిపింది. ఇక అఫ్రిన్‌ పాత్రని ముగించిన తీరు బాగుంది. చివరి పతాక సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఈ సినిమాని చూస్తుంటే మహానటి ఛాయలు కనిపిస్తుంటాయి. అందులో సమంత విజరుదేవరకొండ సావిత్రి గురించి తెలుపుతూ కథని నడిపించినట్లుగా... ఇందులో అఫ్రిన్‌ సీతకు ప్రేమ లేఖను అందజేసే క్రమంలో.. రామ్‌ గురించి..వారి ప్రేమ గురించి తెలుసుకుంటూ, మధ్యమధ్యలో యుద్ధ వాతావరణాన్ని, కాశ్మీర్‌ అందాల్ని చూపిస్తున్నట్లుగా ఉంది. ఓవరాల్‌గా ఈ చిత్రానిన్న చూసిన ప్రేక్షకులు.. ఓ స్వచ్ఛమైన ప్రేమకథని చూసినట్లుగా ఫీలవుతారు.

dulkar


ఎవరెలా చేశారంటే..
లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయాడు. ఆ పాత్రకి తాను తప్ప మరొకరని ఊహించలేనట్టుగా అతను నటించాడు. ఇక సీతగా మృణాల్‌ ఠాకూర్‌ తన పాత్రకి న్యాయం చేసింది. అఫ్రిన్‌గా రష్మిక బాగా నటించింది. డిఫరెంట్‌ షేడ్‌ ఉన్న విష్ణుశర్మ పాత్రలో సుమంత నటన పరవాలేదు. ఇక ప్రకాశ్‌రాజ్‌, వెన్నెలకిషోర్‌, తరుణ్‌భాస్కర్‌ తదితర నటీనటుల తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఆయన పాటలతోనూ, నేపథ్య సంగీతంతోనూ ప్రేక్షకుల్ని కథలో లీనం చేశాడు. వైజయంతీ మూవీస్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.