Jul 03,2022 18:23

కరోనా కష్టాలను దాటుకొని 2022లో అడుగుపెట్టిన తెలుగు చిత్రసీమ హిట్లు, ప్లాపులతో తీపి, చేదు రుచులను చవిచూసింది. జనవరి 1న రాంగోపాల్‌వర్మ 'ఆశ ఎన్‌కౌంటర్‌' చిత్రంతో థియేటర్‌ విడుదలకు తెరతీశారు. అదే నెలలో సంక్రాంతికి వస్తాయనుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'రాధేశ్యామ్‌' మరోసారి వాయిదాపడి సినీప్రేమికులను నిరాశపర్చినా 'బంగార్రాజు', 'హీరో' చిత్రాలు విడుదలై కొంతమేర పర్వాలేదనిపించాయి. ఫిబ్రవరి నుంచి వరుసగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో 'భీమ్లానాయక్‌', మార్చిలో 'రాధేశ్యామ్‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', ఏప్రిల్‌లో 'ఆచార్య', మేలో మహేష్‌బాబు 'సర్కారువారి పాట', జూన్‌లో నాని నటించిన 'అంటే సుందరానికి', సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్‌' చిత్రాలు విడుదలయ్యాయి. తమ అభిమాన హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోలు, ప్రయోగాత్మక చిత్రం రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' వంటి చిత్రాలు కూడా ఈ మధ్య కాలంలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి.

రీమేక్‌లు, ఓటీటీ విడుదలలతో కూడా 2022 ప్రథమార్థం కళకళలాడింది. 'కేజీఎఫ్‌ -2', కమల్‌హాసన్‌ నటించిన 'విక్రమ్‌' మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు విజయ్  'బీస్ట్‌', అజిత్‌ 'వలిమై', సూర్య 'ఈటీ', విశాల్‌ 'సామాన్యుడు' వారి అభిమానులను సంతోషపెట్టాయి. సుమంత్‌ 'మళ్లీ మొదలైంది', ప్రియమణి 'భామా కలాపం' చిత్రాలతో పాటు మలయాళం, హిందీ భాషల్లో థియేటర్‌లో విడుదలైన కొన్నిచిత్రాలు ఓటీటీలో విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ ఆర్నెల్లలో విడుదలైన మొత్తం సినిమాలు 115 అయితే వాటిలో తెలుగు 93, అనువాదాలు 22 ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం అందుకున్నవి మాత్రం చాలా తక్కువ. భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో వచ్చిన సినిమాలు కూడా బోల్తాపడ్డాయి. ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన 'రాధేశ్యామ్‌' పెద్ద డిజాస్టర్‌గా మిగిలి చిత్రసీమను డోలాయమానంలోకి తీసుకెళ్లింది. పవన్‌కళ్యాణ్‌, రానా చిత్రం 'భీమ్లా నాయక్‌'కు టికెట్ల ధర అంశంతో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారీ అంచనాల మధ్య మొట్టమొదటిసారిగా ఫుల్‌లెంగ్త్‌ పాత్రల్లో తండ్రీకొడుకులిద్దరూ కలసి నటించిన 'ఆచార్య' సినిమా చిరంజీవి, రామ్‌చరణ్‌ అభిమానులను నిరాశకు గురిచేసింది.
మార్పు స్పష్టం..
గతంలో ప్రేక్షకుడు సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. అంత స్థోమత లేనివారు టీవీలో చూడడానికి చాలాకాలం పట్టేది. అయితే కరోనా కాలంలో సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదిక బాగా దగ్గరైంది. స్వల్ప మొత్తంతో ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే ఓటీటీ ఉండగా బోలెడు ఖర్చు పెట్టుకుని థియేటర్‌కు ఎందుకు అనుకుంటున్నాడు సగటు ప్రేక్షకుడు. ఇక పైరసీ ఎలాగూ ఉండనే ఉంది. థియేటర్‌లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే నెట్టింట్లో సినిమా ప్రత్యక్షమవుతోంది.
 

సినిమా కష్టాలు..
కరోనా కాలంలో ఎక్కడివక్కడ షూటింగులు ఆగిపోయి ఆదుకునేవారు లేక ఆపన్నహస్తం అందించే వారు కరువై వేలమంది సినీకార్మికులు రోడ్డున పడ్డారు. ఇంత విపత్కర పరిస్థితిలో ఇండిస్టీ నుంచి వారిని ఆదుకున్నది అతికొద్దిమందే. ఆరు నెలలుగా వరుసగా సినిమా షూటింగులు జరగడంతో పని లభించినా అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకురాలేని పరిస్థితి. పైగా టికెట్‌ ధరలు పెంచమంటూ రాష్ట్రప్రభుత్వాలను అభ్యర్థించిన నిర్మాతలు, హీరోల బృందం కార్మిక కష్టాలను పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తమ వేతనాలను పెంచాలంటూ కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే.. వారి న్యాయమైన కోరికను తీర్చాల్సిన పెద్దలు 'రేపటి నుంచి షూటింగులకు వస్తేనే జీతాల విషయం ఆలోచిస్తామ'ని బెదిరింపులకు దిగిన వైనం కనపడింది. 'చర్చలు సాగుతున్నాయి. వేతనాల విషయం పరిశీలిస్తామ'న్న వార్తలు వచ్చాయేగాని ముగింపు ఏమైందో తెలియదు.

ఇన్ని ఆటుపోట్ల మధ్య ఇండ్రస్టీ పెద్దలు ఇప్పటికైనా ఆచితూచి అడుగులేయాలి. ప్రస్తుతం చాలా సినిమాలు శరవేగంగా షూటింగులు జరుపు కుంటున్నాయి. జయపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. కథ, కథనంపై శ్రద్ధ కనపర్చడంతో పాటు తెరవెనుక సినిమాను నడిపిస్తున్న కార్మికుల కష్టాలపై కూడా సినీ పెద్దలు దృష్టిపెట్టాలి. ఈ క్రమంలోనే సగటు ప్రేక్షకుడు మెచ్చే మరిన్ని చిత్రాలు రావాలని ఆశిద్దాం.