Feb 08,2023 22:30

ప్రతిపక్షాల నిరసన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశ వ్యాప్తంగా కలకలం రేపిన అదాని వ్యవహారంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు జవాబుఇవ్వడానికి బదులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభలో దాటవేత వైఖరిని అవలంభించారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని బుధవారం సమాధానం ఇచ్చారు. సుదీర్ఘంగా సాగిన ఆయన సమాధానంలో అదాని పేరునుగానీ, ఎదుర్కుంటున్న ఆక్రమాల ఆరోపణల గురించి గానీ, అదానితో తనకున్న సంబంధాల గురించిగాని కనీసం ప్రస్తావించలేదు. అభివృద్దిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) చేస్తున్న దాడులే ప్రతిపక్షాలను ఏకం చేస్తోందని అన్నారు. ప్రధాని ఈ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఆయన ప్రసంగం సాగుతున్న సమయంలోనూ, ఆ తరువాత కూడా ప్రధాని తీరుపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అంతకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసిందని అన్నారు. ఆ ప్రసంగానికి హాజరు కాని ఒక పెద్ద నాయకుడు ప్రసంగాన్ని విమర్శించారని అన్నారు. గతంలో భారత్‌ సమస్యల పరిష్కారం కోసం ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. నేడు భారత్‌ జి-20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని అన్నారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉందన్నారు. అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్‌ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని చెప్పారు. గతంలో కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని, తాను దేశ వ్యాప్తంగా ఉన్న 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు రైల్వే అంటే యాక్సిడెంట్లు గుర్తుకొచ్చేవని, నేడు వందే భారత్‌ రైళ్లు చూసి ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని ఆరోపించారు. దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేర్లు పారాయన్నారు. భారత్‌ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కాశ్మీర్‌లో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగియడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇప్పుడు అందరూ కాశ్మీర్‌కు వెళ్లి వస్తున్నారని, ఒకప్పుడు ఆ పరిస్తితి ఉండేది కాదని అన్నారు. దేశంలో 70 సంవత్సరాలలో 70 ఎయిర్‌పోర్టులు నిర్మిస్తే, తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలోని 70 ఎయిర్‌పోర్టులు నిర్మించిందని మోడీ పేర్కొన్నారు. జల మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరోవైపు మోడీ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అదానీ వ్యవహారంపై జెపిసి వేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బిఆర్‌ఎస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.