Dec 08,2022 21:31
  • విజయలక్ష్మి సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి- తాడేపల్లి (గుంటూరు జిల్లా) : ప్రస్తుతం పెట్టుబడిదారి సమాజం సంక్షోభంలో చిక్కుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సుందరయ్యనగర్‌లో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకురాతి జగన్‌ భార్య విజయలక్ష్మి సంతాప సభ గురువారం జరిగింది. తొలుత ఆమె చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపిటిసి సభ్యులు కె.ఉషారాణి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్టుబడిదారి సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో పాలకవర్గ పార్టీలకు అంతుబట్టడంలేదని తెలిపారు. అందుకే వారు మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా భవిష్యత్తు సోషలిజానిదేనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని చంకలు కొట్టుకున్న వాళ్లే నేడు కమ్యూనిజం వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు క్లిష్ట పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో విజయలక్ష్మి లాంటి వారు లేని లోటు పూడ్చలేదని చెప్పారు. విజయలక్ష్మికి నివాళులర్పిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ విజయలక్ష్మి కుటుంబం పార్టీ, ప్రజాసంఘాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సుందరయ్యనగర్‌ ప్రాంతంలో మహిళా సంఘం అభివృద్ధిలో ఆమె కృషి ఎనలేనిదన్నారు. ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులను చేయడంలోనూ, ప్రజాకళలను పెంపొందించే కృషిలోనూ జగన్‌కు విజయలక్ష్మి పూర్తి సహకారం అందించారని తెలిపారు. సంతాప సభలో ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.అచ్యుతరావు, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఎడిటర్‌ ఎస్‌.వెంకట్రావు, ప్రముఖ రచయిత దేవేంద్ర, సిపిఎం నాయకులు జొన్నా శివశంకర్‌, డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.