Sep 29,2022 21:11
  • పోలవరంపై 3 రాష్ట్రాల ఫిర్యాదులపై జలశక్తి మంత్రిత్వశాఖ సమీక్ష
  • సాంకేతిక అంశాలపై అక్టోబరు 7న సిడబ్ల్యుసితో మరోమారు సమావేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టు సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని, ఆ వైపుగా ముందుకు వెళ్లాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. 2009, 2011లో పోలవరం బ్యాక్‌వాటర్‌పై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ ప్రాంతాల్లో ముంపు సమస్య ఉత్పన్నమవుతోందని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలు సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ధర్మాసనం సూచనలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమావేశం గురువారం నిర్వహించింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు డిజైన్స్‌లో అనేక మార్పులు జరిగాయని తెలంగాణ, ముంపు ప్రాంతాల్లో గ్రామసభలతో ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌కె గుప్తా మాట్లాడుతూ.. గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పులకు కట్టుబడే పోలవరం నిర్మాణం జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించామన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టినా గోదావరి నది వరద ముంపులో తేడా ఉండదన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఇఎన్‌సి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలూ లేవన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిళ్లదని అన్నారు. కేంద్రం ఇచ్చిన డిజైన్‌ల ప్రకారమే ముందుకు పోతున్నామన్నారు. ఈ ఏడాది వచ్చిన భారీ వరదలతో తమ ప్రాంతంలో ముంపు జరిగిందని, ముంపు ప్రభావం లేకుండా పోలవరం ఎత్తును తగ్గించాలని ఒడిశా అధికారులు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, చట్టం ప్రకారం ముందుకు పోవాలని ఛత్తీస్‌గఢ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ అధికారులు మాట్లాడుతూ.. గోదావరి నదిలో 36 లక్షల క్యూసెక్కుల వరదకు మాత్రమే అధ్యయనం జరిగిందని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా స్పిల్‌వేలు కట్టారని, ఈ మేరకు మరోమారు సర్వే చేయాలని అన్నారు. పిపిఎ ఛైర్మన్‌ ఆర్‌కె గుప్తా మాట్లాడుతూ.. ఎక్కడా ముంపు సమస్య రాదని, బ్యాక్‌ వాటర్‌ సర్వేపై సాంకేతిక అంశాలపై సిడబ్ల్యుసి అధికారులతో అక్టోబరు 7న మరోసారి సమావేశం అవుదామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి జలవనరులశాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు, ఇఎన్‌సి నారాయణరెడ్డి మాట్లాడారు.