Sep 23,2022 08:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా నేపథ్యంలో రద్దీని నివారించేందుకు ఈ నెల 26 నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. నాన్‌ ఎసి విభాగంలో 'స్టార్‌ లైనర్‌' పేరుతో ప్రవేశపెట్టిన స్లీపర్‌ కోచ్‌ బస్సులను దసరా నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాను న్నామని పేర్కొన్నారు. మొత్తం 62 స్టార్‌ లైనర్‌ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విజయవాడలోని ఆర్‌టిసి హౌస్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4,500 ప్రత్యేక బస్సులు నడపనున్నామని అన్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్‌ సెంటర్‌ 0866-2570005కు ఫోన్‌ చేయొచ్చని సూచించారు.ఉద్యోగోన్నతులు పొందిన 2 వేలమంది ఉద్యోగులకు అక్టోబరులో పాత వేతనాలే ఇవ్వనున్నట్లు చెప్పారు.సమావేశంలో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఎ కోటేశ్వరరావు, కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

                                                        263 హైర్‌ బస్సుల కోసం టెండర్లు

ఎపిఎస్‌ ఆర్‌టిసి మరోసారి 263 హైర్‌ బస్సులను తీసుకునేందుకు టెండర్లు పిలిచింది. ఔత్సాహిక బిడ్డర్లు ఈ నెల 23 నుంచి అక్టోబరు 12 వరకూ ఈ టెండర్లు దాఖలు చేయొచ్చని ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.