Aug 18,2022 13:19

హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున చేతిలో కనిపించే ఖడ్గం కీలకపాత్ర పోషిస్తుందట. అందుకే చిత్ర యూనిట్‌ ఈ ఖడ్గానికి సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. చిత్రయూనిట్‌ ప్రకటించినట్టుగానే దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో.. 'తమహగనే' అనే మెటల్‌ని బైటికి తీసి.. కొలిమిలో కాల్చి, సుత్తితో కొట్టి నాగార్జున పెద్ద ఖడ్గంగా మారుస్తారు. అలాగే నాగార్జున ఒక చేత్తో తుపాకి, మరోచేతిలో ఖడ్గం పట్టుకుని శత్రు సంహారానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ వీడియో.. సినిమాపై భారీ అంచనాల్ని పెంచేసింది.
జపనీస్‌లో 'తమహగనే' అనేది ఒక ప్రత్యేకమైన ఉక్కు. దీంతో తయారుచేసే ఆయుధాన్ని జపనీస్‌ భాషలో కటవా అని పిలుస్తారు. కాగా, 'ది ఘోస్ట్‌' చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.