Sep 26,2022 07:55

తెలుగు సాహితీ వనం ఇటీవల 'వసంత వీచిక' పేరిట ఒక కవితా సంకలనం వెలువరించింది. ఈ గ్రూప్‌ నిర్వాహకురాలు, గజల్‌ రచయిత్రి శాంతి కృష్ణ ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని వెలువరించారు. కవితలన్నీ వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కవితలుగా ఎన్నిక కాబడినవే. దీంతో వస్తుశిల్పాల పట్ల కవులు కొంతవరకు జాగ్రత్తలు పాటించారు. ప్రతి ఒక కవి, కవయిత్రి కవిత్వం రాయాలనే తపనతో రాసినట్టు కనపడుతోంది.
        కవిత్వం రాయడానికి ప్రత్యేకమైన అర్హతలు అక్కర్లేదు. స్పందించే హృదయం ఉంటే చాలు. ఎవరైనా కవిత్వం రాయవచ్చని నేను నా కవిత్వం -డిక్షన్‌ (కవితా నిర్మాణ పద్ధతులు)లో ఏనాడో తెలిపాను. ఇప్పుడు తెలుగు సాహితీవనం అలా స్పందించే కవితా హృదయాలకు వేదిక కావడం ఒక మంచి పరిణామం. అందులోనూ చక్కని ముఖచిత్రంతో అందమైన ముద్రణతో (తప్పులు లేకుండా) ఆకర్షణీయమైన డిజైన్‌తో... పుస్తకం వెలువడటం నిర్వాహకుల నిబద్ధతకు నిదర్శనం.
        84 పేజీలున్న ఈ సంకలనంలో 53 మంది రాసిన కవితలు ఉన్నాయి. ఈ కవితలను తూచే తూనికరాళ్ళు ఎవరి దగ్గరా ఉండనక్కరలేదు. చదివి ఆనందించే హృదయాలు ఉంటే చాలు. అందరి కవితల్లో ఏదో ఒక సందేశమో... సంవేదనో... మెరుపులాంటి ఆలోచనో... సుకుమార భావనో... అందమైన మెటాఫరో... పోలికైన, పొందికైన సిమిలియో... చక్కని పదబంధమో... చిక్కని భావచిత్రమో... ఏదో ఒకటి కనిపించకపోదు. ఇందులోని కవులు వస్తువును ఎలా కవితగా మెరిపించారో చూడాలి. ఎలా స్పందించారో అంచనా వేయాలి. అలాంటి సహృదయంతో ఈ సంకలనంలోని కవితలను మనం పరిశీలిస్తే...ఎన్నో రమణీయ భావాలు, కమనీయ కవితా రూపాలు కనిపిస్తాయి.
ఇందులో ఋతురాగాలు, నాన్న, ప్రతిబింబం, వెన్నెల జల్లు, ప్రేమ, మహిళ లాంటి వస్తువులపై కవితలు రాయమని అడ్మిన్లు సూచించడంతో ఆ పరిధిలోనే సృజనకారులు శక్తివంచన లేకుండా కృషి చేసి చక్కని కవితలు శిల్పీకరించారు. వీరితోపాటు సమూహ నిర్వాహకులు శాంతికృష్ణ, విజయ గోలి, తాడిమేటి సూర్యప్రకాశరావు, డా. కృష్ణారావు రెడ్నం, శ్రీధర్‌ రెడ్డి బిల్లా, దాకారపు బాబూరావు, నవీన్‌ చంద్ర హౌతల కవితలున్నాయి. వీరంతా మంచి భావుకతతో కవిత్వం పండించి కొత్తవారికి మార్గదర్శకులయ్యారు.
        వసంత వీచిక కవితా సంపుటిలోని కొందరు కవుల కవితలు భావస్ఫోరకంగా ఉంటూ అభివ్యక్తి నవ్యతతో తళుకులీనాయి. 'ఋతురాగం' అన్న కవితలో... జయసుధ కోసూరి... 'ఆనందం అర్ణవమైన వేళ / మేఘాలు ఋతురాగమాలపించాయి' అంటారు. ఎంత చక్కని ఊహ. ఆనందం అర్ణవం (సముద్రం) అయిన సమయంలో మేఘాలు ఋతురాగమాలపించాయి అనడం కొత్త అభివ్యక్తి. ఇలాంటి expressions వల్లనే కవిత్వం మెస్మరిజం అనిపిస్తుంది. అలాగే రమణకుమారి... 'శిశిరం వణికించి భూమాతకు హిమకంబళి చుట్ట బెట్టి/ వృద్ధాప్యంలో బాల్యం కోసం తపించినట్లు.../ మళ్ళీ వసంతంకోసం ఎదురు చూపులు' అని కమనీయంగా అన్నారు. ఇలాంటి కొత్త అభివ్యక్తుల వల్లనే కవులు తమ సొంత ఉనికిని చాటుకోగల్గుతారు. 'హిమకంబళి' అన్న పదబంధంతోనే కవిత కొత్త నిర్మాణం పొందింది. మరో కవి వీరవెంకట రాజా కవితలో... 'వసంత మంటే... చిగురుకరవాలమెత్తి/ శిశిరపు శిరస్సు నరికినట్టు/ వనం మేనంతా హరిత వస్త్రం కప్పినట్టు' అన్నారు. ఇలాంటి కొత్త కవితా పాదాలు కవితకు కొత్త diction ను తెచ్చిపెడతాయి. చిగురు కరవాలం, శిశిరపు శిరస్సు లాంటి symbols కవి కొత్తగా సృష్టించాడు కాబట్టి కవిత కొత్తగా ఉంది.
      కవితకు శీర్షిక మనిషికి తలలాంటిది. భావం హృదయం లాంటిది. ప్రతీకలు చేతులు కాళ్ళు లాంటివి. అభివ్యక్తి నడక లాంటిది. కవితను ఎన్ని మెటాఫర్లతో ముస్తాబు చేసినా అభివ్యక్తి కొత్తగా లేకుంటే కవిత అందరి దృష్టిని ఆకర్షించదు. Dress బాగుండి addressing (మాట్లాడటం) బాగా లేకుంటే రసజ్ఞులు మెచ్చుకోరు. కవితలో అలంకారికత బాగున్నా అందమైన అభివ్యక్తి లేకుంటే ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని కొత్త కవులు గుర్తించాలి. కవితకు... ప్రారంభం, నడక, ముగింపుతో పాటు శీర్షిక ముఖ్యం. అది సింబాలిక్‌గా ఉంటే మరీ మంచిది. ధ్వని పూర్వకంగా లేదా అర్థవంతంగా ఉన్నా సరే! డా.అన్నపురెడ్డి వీరారెడ్డి 'మా నాన్నే మాకు నారాయణ' అన్న శీర్షికను కవితకు పెట్టడంతో అసలైన అర్థం ఔచితీవంతంగా ధ్వనించింది. క్షేమేంద్రుని ఔచితీ చర్చ, ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతాలను... ఇలాంటి శీర్షికలు గుర్తుకు తెస్తాయి.

ఇంకా ఈ సంపుటిలో.. 'ఎద లోయల్లో విహరించే భావావేశం విహంగాలు/ ముఖ కమలాలపై కొలువు దీరడమే' - మక్కువ అరుణ కుమారి.
'నీ రాకకై నిరీక్షిస్తూ ఎన్ని వసంతాలు/ వలసపోయాయో తెలుసా నీకు' - సి.గాయత్రీదేవి
'వృద్ధాప్యం చదివేసిన దినపత్రిక కాదు/ జీవితాంతం దాచుకునే జన్మపత్రిక' - కొమురవెల్లి అంజయ్య
'అపురూపమైన అనుబంధాల అల్లికలో దాగిన/ అనురాగపు దారమేగా ప్రేమంటే' - పరికిబండ్ల విష్ణుప్రియ
.. ఇలా చాలామంది కవులు, కవయిత్రులు మంచి భావుకతతో ఘుమఘుమలాడే కాఫీలాంటి కవిత్వం రాశారు. ఈ గ్రూపు అడ్మిన్లు కూడా అందమైన కవితలు రాసి ఈ సంకలనంలో పొందుపరిచారు. 'తెలుగు సాహితీ వన కవిత్వపుమాలికలు/ నిత్యం 'వసంతవీచికల' వింజామరలు' అని గ్రూపు నిర్వాహకురాలు శాంతికృష్ణ అనడం ఎంతో ఔచితీవంతంగా ఉంది. 'కలిమి దొరల కంఠానికి కానుక నేను కావాలని లేదు/ రాజకీయ శవ పేటికపై తుళ్ళి పడే జల్లును కాలేను' అంటూ విజయగోలి రాసిన అభిలాష కవిత నేటి వ్యవస్థపై విసిరిన వ్యంగ్యాస్త్రం. తాడిమేటి సూర్యప్రకాశరావు రాసిన 'అన్నీ మొక్కలే అపుడు నీవు/ తులసి మొక్కవై విలసిల్లాలి' అని కవిత రాశారు. డా.కష్ణారావు రెడ్నం రాసిన 'వసంతం మనోహరం'

లలితపదాల పోహళింపుతో మధుర భావాల అభివ్యక్తితో దేవులపల్లి కష్ణశాస్త్రిని గుర్తుచేస్తుంది. శ్రీధర్‌ రెడ్డి బిల్లా 'ఆ వేపచెట్టు కింద' Narrative poetic style poem సూపర్‌. ఇక ఈ సంపుటిలో చివరి కవిత నవీన్‌ చంద్రహౌత రాసిన 'పదిమందిలో' superb. 'ఆమె ఓ మంద్రస్వర ప్రవాహం/ అర్థం చేసుకున్న వాళ్ళకు అద్భుతం' అనడం బాగుంది. ఈ సంపుటిలోని కవులకు కవితా నిర్మాణాల పట్ల శిక్షణనిస్తే... ఇందులోని కవులూ, కవయిత్రులందరూ ... జపాన్‌ కవి (15 శతాబ్దం వాడు)అరికిటా మొరిటకే లాగా...
The fallen flower/ I see returning/ To its branch/ Oh!a butterfly (రాలిన పువ్వు/ తిరిగి తన కొమ్మకు వెళుతున్నట్టు/ సీతాకోకచిలుక/ చిగురుకొమ్మపై వాలింది) లాంటి అభివ్యక్తి నవ్యత కలిగిన మంచి కవితలు రాసి తెలుగు కవితా కేదారాన్ని సుసంపన్నం చేస్తారనడంలో సందేహం లేదు.

- కళారత్న బిక్కి కృష్ణ
83744 39053