Mar 18,2023 06:33

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ బడ్జెట్‌లో బ్రహ్మాండమైన కేటాయింపులు ఉంటాయని భావించిన ప్రజల ఆశలపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నీళ్లు కుమ్మరించారు. శాసనసభలో రూ.279279 కోట్లతో 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదించిన ఆయన.. అంకెలకు ఫ్యాషన్‌ సొబగులు అద్దారే కానీ..ప్రాథమ్యాలను గుర్తించి తగిన కేటాయింపులు జరపడంలో విఫలమయ్యారు. బడ్జెట్‌ ప్రసంగం పొడువునా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ఉటంకింపులు గొప్పగా ఉన్నాయి. కాని, అందుకు తగిన ఆచరణ మాత్రం కనిపించడం లేదు. ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తున్నాం..ఇదిగో పోలవరం..అదిగో కడప ఉక్కు.. 'నాడు నేడు'తో విద్య, వైద్య రంగాల దిశ మార్చేస్తున్నాం..ఇంతకన్నా సంక్షేమమా..సవాల్‌ ! అంటూ పాలక పెద్దలందరూ నిత్యం వల్లించే గొప్పలన్నీ..ఊసుపోక కబుర్లేనని బుగ్గన పద్దుతో తేలిపోయింది.
వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రహదారులు, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలన్నిటికీ అత్తెసరు కేటాయింపులతోనే సరిపెట్టడం 'సంక్షేమ పాలకులు'గా స్వీయ భుజకీర్తులు తగిలించుకున్నవారికి తగని పని. ఏ బడ్జెట్‌లో అయినా సరే మూలధన వ్యయం మొత్తం పద్దులో 25 శాతం ఉంటే దానిని మంచి ఆర్థిక ప్రణాళికగా పరిగణిస్తారు. కానీ బుగ్గన పద్దులో మూలధన వ్యయానికి ఈ ఏడాది రూ.31061 కోట్లతో సరిపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 11.12 శాతమే. 2022-23 బడ్జెట్‌లో మూలధన వ్యయంగా రూ.30679 కోట్లు ప్రతిపాదించి..ఈ ఏడాది జనవరి వరకు పది నెలల్లో రూ.7367 కోట్లే ఖర్చు చేశారు. ఇక ఈ ఏడాది ప్రతిపాదించిన మూలధన వ్యయంలో ఎంత ఖర్చు చేస్తారనేది సందేహమే. ఈ అరకొర కేటాయింపులు, కుదింపు ఖర్చులతో పోలవరం పునరావాసం, వెలిగొండ, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేదెన్నడు? రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఉన్నత న్యాయస్థానమే లక్ష్యాలు నిర్దేశించినా..బడ్జెట్‌లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం. పోనీ పాలకపక్షం మూడు రాజధానులుగా చెబుతున్న నగరాలకేమైనా విదిలించారా? అంటే అదీ లేదు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ గురించి ప్రస్తావన లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ రద్దు చేస్తామన్న హామీ నాలుగేళ్లుగా వెక్కిరిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులతో సహా శ్రమజీవులందరినీ ఈ బడ్జెట్‌ పూర్తిగా విస్మరించిందన్నది వాస్తవం. మసిబూసి మారేడు కాయ అని ప్రజలను మోసం చేసే ప్రయత్నాలే మినహా రాష్ట్రాభివృద్ధికి దోహదకారి అయ్యే పద్దులేవీ ఈ దఫా బడ్జెట్‌లో కానరాలేదు. నగదు బదిలీ పథకాలు మినహాయిస్తే రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు ఒరిగిందేమిటంటూ అధికారపక్షంలోనూ అసంతృప్తి స్వరం వినిపిస్తుండటం గమనార్హం.
గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కుట్రలు సాగిస్తుంటే..రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని అనుసరించడం ఆందోళనకరం. 'ఉపాధి'కి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కనీసం రూ.500 కోట్లు అయినా కేటాయించాల్సి వుండగా ఆ ప్రస్తావనే చేయకపోవడం పేదలపై కక్ష పూనడమే. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అప్పులు చేయడం తప్పుకాకపోవచ్చు. కానీ అప్పుగా తెచ్చిన సొమ్మంతా కొన్ని పథకాలకు తగలేసి.. ప్రాధాన్యతా రంగాలను విస్మరిస్తే రాష్ట్రాభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే రాష్ట్రం చేసిన అప్పులకు ప్రతి యేటా వడ్డీల కింద రూ.28 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. నాలుగు సంవత్సరాల్లో ఏడాదికి రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తే ఈ సంవత్సరం రూ.56 వేల కోట్లకు పెరిగింది. 'కుల పోరాటం కాదు..వర్గ పోరాటం' చేస్తున్నామంటూ ఒకవైపు అభ్యుదయ పలుకులు పలుకుతూ మరోవైపు నిధుల నిరాకరణ ద్వారా శ్రామికవర్గాన్ని అణిచేసే ఎత్తులు వేయడం పాలకపక్షానికే చెల్లింది. వినాశకరమైన ఈ విధానాలను వ్యతిరేకించకుండా అణిచేసేందుకే జీవో నంబరు 1 వంటి నిరంకుశ ఆయుధాలతో పాలకులు పన్నాగాలు పన్నుతుంటారు. విశాల ఐక్య పోరాటాలతోనే ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పన్నాగాలను అడ్డుకోగలం.