
ప్రజాశక్తి-నెల్లూరు : ఎపిఎస్ ఆర్టిసి ఎస్డబ్ల్యుఎఫ్ 12వ రాష్ట్ర మహాసభను డిసెంబరు 15, 16, 17 తేదీల్లో నెల్లూరులో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కట్టా సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ధేశించేందుకు మహాసభ దోహదపడుతుందని పేర్కొన్నారు. నెల్లూరు ఆర్టిసి బస్టాండ్ ఆవరణలోని ఎస్డబ్ల్యుఎఫ్ కార్యాలయంలో మహాసభ బ్రోచర్‌ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 44 ఏళ్లుగా సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ప్రయాణికుల పరిరక్షణ కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ అనేక పోరాటాలు చేస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నెల్లూరులో జరగనున్న రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ ఎస్కె ఖాజావలీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.రాజశేఖర్, ఎ.కృష్ణయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ వి.కష్ణారావు, కార్మికులు పాల్గొన్నారు.