
- ఉమ్మడి పశ్చిమగోదావరిలో సాగిన ప్రత్యేక హోదా సమరయాత్ర 2.0
ప్రజాశక్తి - ఏలూరు టౌన్/భీమవరం : 'పార్లమెంటులో చట్టం చేశారు.. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీలు గుప్పించారు.. ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఏఒక్క హామీ అమలు చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధమవుతాం' అని విద్యార్థి యువజన సంఘాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి హెచ్చరించాయి. విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన 'ప్రత్యేక హోదా సాధన సమరయాత్ర 2.0' మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కె.నాని అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... హోదా, విభజన హామీల అమలు కోసం విద్యార్థులు, యువత నడుం బిగించాలని కోరారు. వామపక్ష పార్టీలు మినహా మిగిలిన ఏ ఒక్క పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం అఖిలపక్షం నిర్వహించి, కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ.. ఈ యాత్రకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ నిత్యావసర ధరల రూపంలో ప్రజలపై పెనుభారాలు మోపుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు మాట్లాడారు. హోదా తీసుకొస్తామని ఎన్నికల ముందు చెప్పిన వైసిపి నేడు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్, సామాజిక ఉద్యమకారిణి మనోహరమ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర బాలికల కో-కన్వీనర్ సిహెచ్.పావని, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వాసు, డి.పెద్దిరాజు పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాత్ర చేరుకుంది.
