Sep 18,2023 07:22

         చిన్న చిన్న పదాలతో, తేలికగా అర్థమయ్యే భావంతో, ముచ్చట గొలిపే సంభాషణలతో, మురిపించే సన్నివేశాలతో చిన్నారుల కోసం రాయడం ఒక కళ. అమ్మ జోల పాట వింటే కలిగే ఆనందం, అన్నంలో పాలు, పంచదార కలిపి తింటే కలిగే సంతృప్తిని చిన్నారులకు కలిగిస్తూ ఆనందలోకాల్లో విహరింపచేసే రచనలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కథల్లో పాత్రలన్నీ జంతువులే ఉంటాయి కానీ అవి ఒకదాన్ని ఒకటి చంపుకోవు. పేరుకి అడవికి మృగరాజు కానీ క్రూరత్వం ఎరుగదు. అనేక జంతువులు మన కళ్లముందు కనబడుతూ మంచి పనులు చేస్తుంటాయి. మనుషుల్లాగానే మాట్లాడుతుంటాయి. మనలో ఒకరిగా మారిపోయి మనల్ని అడవికి తీసుకెళ్లి అనేక ఊసుల్ని చెబుతుంటాయి. ఇవన్నీ జరిగేది పైడిమర్రి రామకృష్ణ గారి కథల్లో మాత్రమే !
        పిల్లల కోసం అనేక రకాల రచనలు చేసిన పైడిమర్రి రామకృష్ణ తాజా వెలువరించిన కథల సంపుటి 'తాంబేలు ఇగురం'. ఇందులో 30 కథలున్నాయి. కథలన్నీ చదివిన తర్వాత పిల్లలు తప్పక ఆనందం పొందగలరని చెప్పవచ్చు. ఈ కథలన్నీ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడి పాఠకాదరణ పొందినవే. పుస్తకం కొని చదివే తెలంగాణేతర పాఠకులను దృష్టిలో పెట్టుకొని తాబేలుని తెలంగాణలో 'తాంబేలు' అని పిలుస్తారని, 'ఇగురం' అంటే తెలివి అని తన ముందుమాటలో రచయిత వివరించారు. కథలన్నీ దేనికదే చక్కగా చదవాలనిపించేలా ఆసక్తికరంగా మలిచారు. 'ఎత్తుకెదిగిన కోతి' కథలో తన మిత్రుడైన ఏనుగుకి జంతువులన్నీ గౌరవం ఇవ్వడానికి కారణం అది చాలా బలంగా, ఎత్తుగా ఉండడం వల్లనే అనుకుంటుంది కోతి. ఆ ఏనుగు అందరికీ సహాయపడుతూ మంచి పేరు పొందిన విధానం చూసిన తర్వాత తన అభిప్రాయం మార్చుకుంటుంది. గౌరవం అనేది ఎత్తుని బట్టి కాదు, ఆకారాన్ని బట్టి అసలే కాదని, చేసే మంచి పనులు, చూపే ప్రతిభను బట్టి అని తెలుసుకుంటుంది . చిన్నారులు కూడా మంచి పనులు చేస్తూ మంచి పేరు పొందాలనే విషయాన్ని తెలుపుతుంది ఈ కథ.
             'తాంబేలు ఇగురం' కథలో ఒక కప్ప తన దోస్తుల మధ్య పోటీలు పెట్టి, పందెం కాయించేది. ఓడిపోయిన వాళ్లను తిట్టుకుంటూ సంబరపడేది. చెరువు నుండి వెళ్ల గొట్టేది. ఒకసారి ఓడిపోయిన తాబేలుని కూడా చెరువు నుండి బయటకు తరిమింది. కప్పకు అదొక చెడ్డ అలవాటని, అది మాత్రం పోటీలలో పాల్గొకుండా మిగతా వాటి మీద పందాలు కాయించి తమాషా చూస్తుందని ఒక కొంగ ద్వారా తెలుసుకున్న తాబేలు తెలివిగా ఆలోచిస్తుంది. తరువాత జరిగే పోటీల్లో కప్పను పాల్గొనేలా చేసి అందులో దాన్ని ఓడిస్తుంది. కప్పని చెరువు వదిలి పొమ్మని మిగతా జంతువులు, చేపలు చెబుతుంటే అవసరం లేదని వాటికి చెప్పడమే కాకుండా ఒప్పించింది. ''పోటీలో గెలుపు, ఓటమి అనేవి సహజం. అందుకు సిగ్గు పడే పని లేదు. ఎప్పటిలాగానే కలసి ఉందాం'' అనడంతో కప్పకి కనువిప్పు కలిగింది. పిల్లలకీ కథ ద్వారా గెలుపోటములు సమానంగా స్వీకరించాలనే ఆలోచన కలుగుతుంది.
            మైసూర్‌ పాక్‌లో మైసూరు ఉండనట్టే, కొన్నింటికి పేర్లుంటాయి కానీ అక్కడేమీ ఉండదు. ''బుజ్జి కోతి సందేహం'' కథలో ప్రదేశాల పేర్లయిన 'తాబేలు చెరువు', 'పాము పుట్ట', 'పులి గుట్ట'లకి వెళ్ళినప్పుడు ఆయా పేర్లు గల జీవుల కోసం వెతుకుతుంది బుజ్జి కోతి. దాని తల్లి కోతి ''మనం చేసే మంచి పనుల వల్ల కేవలం మనకే కాదు, మన కుటుంబానికి, మనం ఉండే ప్రాంతానికి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే మంచి పనులు చేయాలి. అల్లరి పనులు చేస్తే అవి చెడ్డ పేరుని తెస్తాయి'' అని చెప్పడంతో అంతవరకు అల్లరిదైన బుజ్జి కోతిలో మార్పు వచ్చింది. విద్యార్థినీ విద్యార్థులు కూడా తోచిన మంచి పనులు చేస్తూ మంచి పేరుని గడించాలని , మంచిగా గుర్తుండి పోయే పనులు చేయాలని బోధిస్తుంది ఈ కథ.
'మతిమరుపు తాబేలు' కథలో తనకి పుట్టిన గుడ్లను ఎక్కడో ఒడ్డుమీద ఇసుకలో తాబేలు దాస్తుందని తెలుసుకుంటాం. అలా దాచిన గుడ్లు పిల్లలయ్యాయో లేదోనని తెలుసుకోవడానికి బయలుదేరిన తాబేలుని అనుసరిస్తూ కోతి, నక్క, కుందేలు వెళతాయి. అలా గుడ్లను ఎక్కడో దాచిన తాబేలుని అవి ఎగతాళి చేస్తాయి. తాబేలు గుడ్లు పిల్లలయ్యాయని తెలిసాక వాటితో ''గుడ్లు మేము పొదిగేందుకు అవసరమైన వెచ్చదనం, రక్షణ కోసం వాటిని ఇసుక లోపల దాచి పెడతాం. ఇక అవి పక్వ దశకు రావడం మాకు మానసికంగా తెలుస్తుంది. అప్పుడే అవి పిల్లలై బయటకు వస్తాయి'' అని తాబేలు చెప్పగానే మూడున్నూ తమ అవివేకానికి బాధ పడ్డాయి. విషయం తెలియకుండా అపార్ధం చేసుకుని అవతలి వారిని అవమానించకూడదని ఈ కథ చెబుతుంది.
             మిగతా కథలు కూడా చదివే బాల పాఠకులు తప్పక ప్రయోజనాన్ని పొందుతారు. బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని కలిగించేదే బాలసాహిత్యం అయితే ఆ ప్రయోజనాన్ని ఈ పుస్తకం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ పుస్తకానికి తుంబలి శివాజీ అందమైన ముఖచిత్రం గీయగా, లోపలి పేజీలలో చక్కటి చిత్రాలను శ్రీనివాస్‌ అందించారు. పుస్తకం పేజీలు 104. పుస్తకం ధర రూ.200. పుస్తకం కావలసినవారు రచయితని ఫోను నెంబరులో 9247564699 సంప్రదించవచ్చు.
 

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
94907 99203