Sep 18,2023 12:06

మాస్కో : రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. రష్యాలో ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యటన శనివారంతో ముగిసినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కెసిఎన్‌ఎ ఆదివారం వెల్లడించింది. పర్యటనలో చివరి రోజున ప్రిమోర్సికీ రీజియన్‌ గవర్నర్‌ ఒలేగ్‌ కోజెమ్యాకో కిమ్‌కు మధ్య ఐదు కమికేజ్‌ డ్రోన్లు, ఒక గెరాన్‌-25 నిఘా డ్రోన్‌ను అందించే అంశంపై అంగీకారం కుదిరినట్లు తెలిపింది. రష్యా సైనిక అవసరాల కోసం ప్రిమోర్స్‌కీ రీజియన్‌లో ఉత్పత్తి అవుతున్న పరికరాలను పరిశీలించడం కోసం ఈస్ట్‌ స్ట్రీట్‌ ఎగ్జిబిషన్‌ను కిమ్‌ సందర్శించిన సమయంలో గవర్నర్‌ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలిపింది. అధునాతనమైన, తేలికగా ఉండే శరీర రక్షణ కవచాన్ని, రష్యాకే ప్రత్యేకమైన ఉషాంకా టోపి కిమ్‌కు అందజేశారు. రష్యాలో అతిపెద్దదైన ప్రీమోర్సీకీ అక్వేరియంను కూడా కిమ్‌ సందర్శించారు. ఫార్‌ ఈస్టర్న్‌ ఫెడరల్‌ విశ్వ విద్యాలయాని కిమ్‌ సందర్శించి, అక్కడ చదువుకుంటున్న ఉత్తర కొరియా విద్యార్థులతో మాట్లాడారు. రష్యా పర్యటన కోసం గత మంగళవారం మాస్కో చేరుకున్న కిమ్‌ రష్యా అధ్యక్షులు పుతిన్‌తోనూ చర్చలు జరిపారు.