Jan 12,2023 15:51

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : సంక్రాంతి పండుగ పేరున ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తపేట రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.ముక్కంటి, సిఐ ఎన్‌.రజనీ కుమార్‌ హెచ్చరించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఎంపీటీసీ సభ్యులతో సమావేశం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనగా కోడిపందాలు, జూదం, గుండాట, పేకాట, మేళాలు వంటివి జరగకుండా చూడాలన్నారు. ఇందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. పందాలను కట్టడి చేసేందుకు పోలీసులు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం రాంబాబు మాట్లాడుతూ గ్రామ సర్పంచులు దష్టికి ఇటువంటి కోడి పందాలు, జూదం వంటి విషయాలు వస్తే మేము సహకరించబోమన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో మండల స్థాయి అధికారుల ప్రోత్సాహంతో ప్రతి గ్రామంలో సంక్రాంతి పురస్కారాల్లో భాగంగా పాడి రైతులకు పశువుల అందాల, పాల ఉత్పత్తి, ముగ్గుల పోటీలు, కబడ్డీ, కోకో వంటి సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించే వారిని ఇప్పుడు ఎవరూ కూడా అధికారులు సహకరించడం లేదన్నారు. ఇలా సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించడంతో గ్రామాలలో కోడి పందాలు, జూదం వంటి వాటిపై ప్రజల దృష్టి మరలచే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, తాహసిల్దార్‌ జి.లక్ష్మీపతి, ఎంపీడీవో కె.జాన్‌ లింకన్‌, ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌, వైస్‌ ఎంపిపి దుర్గా భవాని, మాజీ ఎంపిపి తోరాటి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.