Feb 01,2023 21:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి మొండిచేయి ఎదురైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం ఉన్నతవర్గాలను ఉత్సాహపరిచే బడ్జెట్‌ మాత్రమేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు, 2023లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకుని బడ్జెట్‌లో అంకెల గారడీ చేసిందని తెలిపారు. కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలుకు చర్యలు లేకపోవడం విచారకరమన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదని విమర్శించారు. రాష్ట్రం పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం చిన్నచూపుతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇది ఎన్ని'కల' బడ్జెట్‌ అని, కేవలం అంకెల, మాటల గారడీ మాత్రమేనని పేర్కొన్నారు.