Sep 22,2022 20:22
  •  సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ప్రజాశక్తి - పాడేరు రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అడ్మిషన్‌ ఫీజులు తగ్గించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్యర్యాన గురువారం ఐటిడిఎ ముట్టడించారు. అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినదించారు. విద్యార్థులనుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.ప్రభుదాస్‌ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనుల విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. పోలీసులు ఐటిడిఎ వద్దకు చేరుకొని, ప్రభుదాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విడుదల చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ, టిడబ్ల్యు డిడి ఐ.కొండలరావు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, కళాశాలకు వచ్చి విద్యార్థులందరితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.