Feb 01,2023 13:27

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చెప్పారు. మార్చి 3, 4వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఢిల్లీలో మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అమర్నాథ్‌ బుధవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ తో సత్సంబంధాలు కలిగిన వివిధ దేశాల అంబాసిడర్లు, 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్‌, ఫిక్కీ, సిఐఐ, నాస్స్కామ్‌ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని అమర్నాథ్‌ చెప్పారు. ఏపీలో పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివఅద్ధి చెందుతోందన్న విషయాన్ని రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధులకు వివరించారని, ఏపీలో ఉన్న వనరుల గురించి అతిథులకు తెలియజేశారని, దీంతో ఏపీపై వారికున్న నమ్మకం మరింత బలపడిందని, దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారని అమర్నాథ్‌ వివరించారు. జిఎస్పీడీలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, గత ఏడాది 19 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించిందని, నీతి ఆయోగ్‌ వంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విధానాన్ని అభినందిస్తోందన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వివిధ దేశాల ప్రతినిధులకు తెలియజేశారని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకఅతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వనరులను వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ విధానమని సన్నాహక సమావేశానికి హాజరైన ప్రజలకు ముఖ్యమంత్రి తెలియజేశారని అమర్నాథ్‌ వివరించారు. రాష్ట్రంలో 75 శాతం మంది వర్కింగ్‌ గ్రూపు ఉందని, బ్రాండిక్స్‌, అపాచీ వంటి కంపెనీలలో 70శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వెల్లడించినట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తోందని చెప్పారు.
దేశం మొత్తం మీద 11 ఇండిస్టియల్‌ కారిడార్లు ఉండగా, ఇందులో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఏపీకి కలిసి వచ్చే అంశమని, ఇందులో 49 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశామని, పరిశ్రమలు ఏర్పాటుకు ఎవరు ముందుకు వచ్చినా, మౌలిక సదుపాయాలతో పాటు, అనుమతుల మంజూరులో ప్రభుత్వం సరళంగా వ్యవహరిస్తుందని మంత్రి అమర్నాథ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరించామని మంత్రి అమర్నాథ్‌ చెప్తూ, పిసిపిఐఆర్‌, ఫార్మా, టూరిజం రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం ఉన్నట్లు అంబాసిడర్లకు తెలియజేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి విశిష్టతను కూడా వారికి తెలియజేశామని చెప్పారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఏపీ నెంబర్వన్‌ స్థానంలో నిలిచిందని, 974 కిలోమీటర్ల పరిధిలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా వారికి తెలియజేశామని చెప్పారు. తిరుపతిలో ఇప్పటికిప్పుడు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పగా వారు అందుకు ఆకర్షితులయ్యారని అమర్నాథ్‌ వివరించారు. రెన్యువబుల్‌ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని ఆయన వివరించారు. మార్చి మూడు, నాలుగు తేదీల్లో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌, 28, 29 తేదీల్లో జరిగే టి20 సదస్సులు విశాఖ, రాష్ట్ర భవిష్యత్తును మార్చే వేదికలు కాబోతున్నాయని ఆయన చెప్పారు.
        ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖే రాజధాని అని, త్వరలోనే విశాఖకు వస్తానని ప్రకటించిన అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్నాథ్‌ సమాధానం చెబుతూ, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు, రాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చు. తాను త్వరలోనే విశాఖపట్నం, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా చెప్పినప్పుడు దీనిపై చర్చ అవసరం లేదని చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత, రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన ఏవిధంగా కోర్టు ధిక్కరణ అవుతుందని అమర్నాథ్‌ ప్రశ్నించారు. గతంలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను మంత్రి అమర్నాథ్‌ ఉటంకిస్తూ, రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రాలకే ఉంటుందన్న విషయాన్ని విలేకరులకు వివరించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు కార్యాలయాలు ఉంటాయని అన్నారు. ప్రొసీజర్‌ ప్రకారమే ముఖ్యమంత్రి విశాఖకు వస్తారని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఐటీ, టూరిజం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లకు సంబంధించిన భవనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో చర్చనీయాంసమైన ఫోన్‌ టాపింగ్‌ వ్యవహారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమర్నాథ్‌ సమాధానం చెబుతూ, అది ఫోన్‌ టాపింగో, రికార్డింగో తేలాల్సి ఉందని అన్నారు. ఏ ఆధారము లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయటం మంచిది కాదని అమర్నాథ్‌ హితవు పలికారు.

                                                     లోకేష్‌ చూస్తే జాలేస్తోంది : అమర్నాథ్‌

లోకేష్‌ ను చూస్తే తనకు జాలేస్తోందని మంత్రి అమర్నాథ్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులంతా లోకేష్‌ ను నాయకునిగా చూడాలనుకుంటున్నారని, కానీ చంద్రబాబు నాయుడుకి అటువంటి ఆలోచన లేదని ఆయన అన్నారు. కొడుకును నాయకుడిగా తీర్చిదిద్దాలనుకున్న ఆలోచన చంద్రబాబుకు ఉంటే లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర తొలి సభకైనా హాజరయ్యే వారిని, అధికారం విషయంలో చంద్రబాబుకు కొడుకైనా మామైనా ఒకటేనని, అందుకే లోకేష్‌ ను చూస్తే జాలేస్తోందని అమర్నాథ్‌ అన్నారు.

                                                       పవన్‌ కళ్యాణ్‌ కు నాయకత్వ లక్షణాలు లేవు

పవన్‌ కళ్యాణ్‌ కు నాయకత్వ లక్షణాలు లేవని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ అధినాయకుడైనా పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఇంటింటా ఎగరాలని భావిస్తాడని, అలాగే రాష్ట్రంలోని అన్ని సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటాడని, కానీ పవన్‌ కళ్యాణ్‌ 25 నుంచి 30 సీట్లకు బేరం ఆడుకుంటున్నాడని, ఈయన సీఎం ఎలా అవుతాడని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు.