Mar 18,2023 18:30

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్‌, పంజాగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో కొద్దిచోట్ల వానపడింది. పలుచోట్ల వడగళ్లు సైతం కురిశాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో వడగళ్లవాన కురిసింది. సంగారెడ్డి పటాన్‌చెరువులో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లవ్యాప్తంగా పలుచోట్ల వడగళ్లు కురిశాయి. కరీంనగర్‌, రామగుడు, గంగాధర మండలాల్లో వర్షం కురిసింది. చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, భీమారం వడగళ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జుక్కల్‌, పెద్దకోడపగల్‌, మద్నూర్‌ మండలం తడ్గూర్‌లో వడగళ్ల కురిసింది. మరో రెండు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.