Feb 05,2023 07:10

'తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ..' అంటూ వేకువజామున మేలుకొలిపే ఆ స్వరం మూగబోయింది. తొలితరం గాయనీమణుల్లో సుశీల, జానకి వంటి హేమాహేమీల సరసన తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న వాణీజయరాం గాత్రం సంగీత భాండాగారం. హిందీ సినిమాలతో ఆమె కెరియర్‌ ప్రారంభమైనా దక్షిణాది చిత్రాలలోనే ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో తక్కువ పాటలే పాడినా అవన్నీ ఆణిముత్యాలే..

1


'మానస సంచరరే.. బ్రహ్మణి మానస సంచరరే..'నని వీనులవిందైన శ్రావ్యసంగీతం వినిపించారు. 'దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు.. నిర్మాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ.. దొరకునా... ఇటువంటి సేవ..' అని శంకరశాస్త్రి శిష్యుని స్వరం నుండి వినిపించే గొంతు ఆమెదే..  'ఆనతి నీయరా హరా... ఆనతి నీయరా హరా...' అంటూ స్వాతికిరణం పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సంగీత ప్రాధాన్యమున్న పాటలే కాదు, ఆమె స్వరం నుంచి హుషారు గొలిపే పాటలు కూడా పాడించారు సంగీత దర్శకులు. 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ.. ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ...' అంటూ సాగే ఆమె స్వరంలోనిదే.. శ్రావ్యమైన ఆ గొంతు నుండే 'నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా.. నువ్‌ రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా..' అనే యుగళగీతం కూడా పాడి చూపారు. 'మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ..' అంటూ హుషారు గొలిపే పాట ఆమె స్వరంలోనిదే..

ఆమె పాడిన ప్రతి పాటా ఓ ఆణిముత్యం. ఆమె గొంతు పరిచయం కాని తెలుగువారే కాదు.. భారతీయులే ఉండరు. ఎందుకంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడిస్సి, భోజ్‌పురి, హిందీ... మొత్తం 14 భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడిన అద్భుత గానం ఆమెది. ఆమె జీవితమంతా సంగీత సాధనలోనే గడిపారు. 'సంగీతమంటే సినిమా పాటలే కాదు.. సంగీతమంటే ఓ మహాసముద్రం. ఎంత ఈదినా ఇంకా మిగిలే వుంటుంది' అని ఎప్పుడూ అనేవారు.
తెలుగులో ఎస్‌పి కోదండపాణి ఆహ్వానం మేరకు 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటి వలె కాదురా.. నా స్వామి.. ఎప్పటి వలె కాదురా..' అనే పాట పాడారు జయరాం. వెంపటి చినసత్యం కొరియోగ్రఫీలో శోభానాయుడు నాట్యం తోడైన ఆ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌.1970లో హిందీ ప్లేబ్లాక్‌ గాయనిగా ఆమె ప్రస్థానం మొదలైంది. రిషికేష్‌ ముఖర్జీ దర్శకత్వంలో వసంత్‌ దేశారు సంగీతం అందించిన 'గుడ్డి' సినిమాలో 'బోలి రే... 'బోలి రే..' అంటూ సాగే పాటను తొలిసారి ఆలపించారు. జయాబచ్చన్‌ మొదటి సినిమా కూడా అదే.. మొదటిపాటకే ఆమె కీర్తి దశదిశలా వ్యాపించింది. జయాబచ్చన్‌ ఒక్కరే కాదు.. శ్రీదేవి, రేఖ, షబనాఅజ్మీ వంటి ఎంతోమంది హీరోయిన్ల తొలి చిత్రాలకు ఆమె గాత్రం అందించారు.

vani
  • తెలుగు మూలాలు

1945 నవంబరు 30న తమిళనాడులోని వెల్లూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. తల్లి పద్మావతి, తండ్రి దొరైస్వామి. పద్మావతి కర్నూలుకు చెందిన వారు. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. వివాహానంతరం భర్తతో పాటు పద్మావతి తమిళనాడుకు వెళ్లారు. అక్కడే ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు కలిగారు. వారిలో ఒకరే వాణీ జయరాం. పద్మావతి తండ్రి ఆంధ్రా డిఎస్‌పిగా పనిచేశారని వాణీ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
సంగీత పాఠాలు ఇలా మొదలయ్యాయి..
సంగీతంపైన తల్లికి ఉన్న మక్కువ పిల్లలందరికీ ఒంటబట్టింది. వాణీకి మరికాస్త అబ్బింది. ఆమె రెండేళ్లకే కూని రాగాలు తీసేవారంట. ఎవరు ఏ రాగంలో పాడితే ఆ రాగం చెప్పేవారంట. ఆమె ఆసక్తిని గమనించి స్థానికంగా ఉన్న సంగీతం మాస్టారు కడలూరు శ్రీనివాస్‌ అయ్యంగార్‌ దగ్గర చేర్పించారు. అలా ఐదేళ్లకే క్లిష్టమైన రాగాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు వాణీ జయరాం.

  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి

వెల్లూరులో పుట్టిన వాణీకి సికింద్రాబాద్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తుండగానే జయరాంతో వివాహం నిశ్చయమైంది. జయరాం బొంబాయిలో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తరువాత వాణీ కూడా అక్కడికి బదిలీ చేయించుకున్నారు.

  • సినిమా పాటలంటే చాలా ఇష్టం

స్వతహాగా వాణీజయరాం ఇంట్లో సినిమా పాటలను ఇష్టపడేవారు కాదు, కానీ వాణీకి చిన్నప్పటి నుండీ సినిమా పాటలంటే చాలా ఇష్టం. ఇంట్లో వారు వింటే తిడతారని భయపడి చాలా తక్కువ సౌండ్‌తో వినేవారంట. తమిళనాడులో పుట్టిపెరిగిన వాణీకి 'హిందీ పాటలంటే చెవి కోసుకునేదాన్న'ని చాలా సందర్భాల్లో చెప్పేవారు. హిందీ భాషపై ఆమెకు చాలా పట్టు వుండేది. అనర్ఘళంగా మాట్లాడేవారు. రాసేవారు. ఆ చొరవే ఆమెను హిందీ సినిమా రంగంలోనూ రాణించేలా చేసింది.

1
  • హిందీ అరంగేట్రం..

ఉస్తాద్‌ ఆధ్వర్యంలో బొంబాయిలో ఎన్నో కచేరీలు చేసిన ఆమెను ఆయన స్నేహితుడు వసంత్‌ దేశారు ఒకసారి కలిశారు. ఉస్తాద్‌తో ఉన్న పరిచయంతో ఆమెను ఇండిస్టీకి ఆహ్వానించారు. అలా వాణీ అరంగేట్రం బాలీవుడ్‌లో మొదలైంది.
 

  • రక్తం రంగు అందరిదీ ఒక్కటే!

మతసామరస్యం గురించి చెబుతూ.. 'క్రిష్టియన్‌కి నీలం రంగులో, ముస్లింలకు ఆకుపచ్చగా, హిందువులకు సింధూరం రంగులో రక్తం ఉండదు. అందరికీ ఒకేలా ఉంటుంది. కాని ఎందుకు ఘర్షణ పడతారు?. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న వ్యత్యాసాలే' అంటారు ఒక సందర్భంలో. ఎక్కువగా వివేకానంద పుస్తకాలు చదువుతానని చెప్పే వాణీజయరాంకు డ్రాయింగ్‌ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్‌ కూడా వేసేవారు. కవితలు, పాటలు రాసేవారు.

1
  • కవితలు, కచేరీలు..

పాటలు పాడడమే కాదు.. కవితలు, కచేరీలు కూడా చేసిన వాణీ పదేళ్ల నుండే రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పాటలు, కవితలు చదివేవారు. దాదాపు పదేళ్లపాటు రేడియో ప్రస్థానం సాగింది. కర్నాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆమె గాయనిగా కొనసాగుతున్నా ఎన్నో కచేరీలు, గజల్స్‌, భజన్స్‌లో పాల్గొన్నారు. రోజుకు 14 నుండి 15 పాటలు పాడి తీరికలేని సమయం గడిపేవారు.

1


జయరాంకు కూడా సంగీతమంటే ప్రాణం. సితార వాయించేవారు. వాణీని చేసుకోవడానికి కారణం కూడా ఆమెకు సంగీతంలో గల ప్రావీణ్యమేనని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. స్వతహాగా సంగీతాభిమాని అయిన జయరాం వాణీని హిందూస్తాని సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించారు. అలా ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమా హాజాబ్‌ వద్ద హిందూస్తానీ నేర్చుకునేందుకు సిద్ధమైన ఆమె రోజుకు 18 గంటలు సంగీత సాధనలోనే గడిపేవారు. రోజూ జ్వరం కూడా వచ్చేది. అయినా సాధన ఆపలేదు. ఉస్తాద్‌ సూచన మేరకు పూర్తి కాలం సంగీతసాధనలో గడిపేందుకు ఉద్యోగాన్నీ వదులుకున్నారు. ఇంత కఠోర సాధన చేసిన ఆమె ఆ తరువాత కాలంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎగబాకారు.
 

10


అతిరధ మహారధుల సంగీత సారధ్యంలో వేల పాటలు పాడారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేశారు. కొత్తదనం కోరుకున్న ప్రతి దర్శకుడు ఆమె పాటతోనే సినిమా ఆరంభించేవారు. అంతలా మంత్రముగ్ధులను చేసిన ఆ గొంతు ఎప్పటికీ సజీవంగా వినిపిస్తూనే ఉంటుంది.