Aug 19,2022 08:01

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి కోసం హౌరా హౌరీగా పోరాడుతున్న ఇద్దరు అభ్యర్థులు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యుకె) లో స్కాట్లాండ్‌ స్థానం విషయంలో దోబూచులాడారు. యుకెను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని లిజ్‌ ట్రస్‌ చెప్పగా, ఈ సమస్యను ఏడాదిలో పరిష్కరించేస్తానని సునాక్‌ అన్నారు. యుకె నుంచి విడిపోవాలని కోరుకుంటున్న స్కాట్లండ్‌ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారా అంటే సూటిగా సమాధానమివ్వకుండా ఇరువురూ దాటవేసే ప్రయత్నం చేశారు. స్వతంత్ర స్కాట్లండ్‌ అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అంశమని మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ అన్నారు. స్కాట్లండ్‌ అర్ద స్వయంపాలిత ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ (ఎస్‌ఎన్‌పి) వచ్చే ఏడాది రెండో స్వతంత్ర రిఫరెండమ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇది ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఇంగ్లండ్‌ భావిస్తుంది. . ఇంగ్లండ్‌, స్కాట్ల్లండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ ఈ నాలుగు దేశాలను కలిపి ఉంచే బంధం బ్రెగ్జిట్‌ తరువాత క్రమంగా బలహీనపడుతోంది.
          ఆరోగ్యం, విద్యపై స్కాటిష్‌ ప్రభుత్వం మరింత దఅష్టి పెట్టాలని వారు కోరారు. ఐరోపాలో స్కాట్లాండ్‌ అత్యధిక డ్రగ్‌ మరణాలను కలిగి ఉంది. జనాభాలో మూడింట రెండొంతుల మంది ఊబకాయం లేదా అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అయితే విద్యా వ్యసవ్థ యుకెలో చాలా బలహీనంగా ఉందని థింక్‌ ట్యాంక్‌ నివేదిక తెలిపింది. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మాట్లాడుతూ; ' మేము ఇరుగుపొరుగు వాళ్లం మాత్రమే కాదు, మేమంతా ఒక కుటుంబం. మా కుటుంబం చీలి పోవడానికి నేనెన్నడూ అనుమతించను' అని కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులనుద్దేశించి అన్నారు సనాక్‌ మాట్లాడుతూ, 'ఇది గెలుపోటములకు సంబంధించిన సమస్య కాదు, ఈ సమస్యను పరిష్కరించకుండా దశాబ్దాల తరబడి నాన్చుతూ వస్తున్న ప్రభుత్వ వైఖరే సరికాదని అన్నారు. తాను ప్రధాని అయితే, వార్షిక బ్రిటిష్‌ పార్లమెంటు కమిటీ విచారణలకు స్కాటిష్‌ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఆదేశిస్తానని , స్కాటిష్‌ ప్రజలకు అందుతున్న సేవలు ఇంగ్లండ్‌, వేల్స్‌తో పోల్చి చూసి లోపాలుంటే సరిచేస్తామని అన్నారు.