Aug 09,2022 22:16

బర్మింగ్‌హామ్‌ :బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత బృందం 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో సహా మొత్తం 61పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. గేమ్స్‌ ప్రారంభానికి ముందు టాప్‌ా5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్‌కు చేరుకుంది. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానునే ప్రారంభించింది. మహిళల 49కిలోల విభాగంలో ఆమె తొలి పసిడిని అందించింది. టేబుల్‌ టెన్నిస్‌లో వెటరన్‌ శరత్‌ కమల్‌ స్వర్ణంతో ఈ పతకాల వేట ముగిసింది. భారీ అంచనాలతో బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు, మహిళల క్రికెట్‌ జట్టు రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 72దేశాల నుంచి 20క్రీడాంశాలకు సంబంధించి 5వేలమందికి పైగా అథ్లెట్లు పాల్గంటే.. భారత్‌ నుంచి 210మంది ప్రాతినిధ్యం వహించారు. ఆతిథ్య ఇంగ్లండ్‌ నుంచి అత్యధికంగా 438మంది, ఆ తర్వాత ఆస్ట్రేలియానుంచి 427మంది పాల్గన్నారు.

  • బెటరే.. కానీ..

2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడలతో పోల్చిచూస్తే ఈసారి భేషుగ్గానే మన అథ్లెట్లు రాణించారు. ఈ క్రీడల్లో మొత్తం 61పతకాలను సాధిచారు. గత క్రీడల్లో భారత్‌కు 66పతకాలు దక్కితే.. ఈసారి ఐదు పతకాలు ఈసారి తగ్గాయి. 2018లో షూటింగ్‌ విభాగంలోనే 16 పతకాలు రాగా.. ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌కు చోటు దక్కలేదు. మహిళల క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ 3ా3, వీల్‌చైర్‌ బాస్కెట్‌ బాల్‌ 3ా3, మిక్స్‌డ్‌ సింక్రనైజ్డ్‌ డైవింగ్‌, పారా క్రీడలకు కామన్వెల్త్‌ క్రీడల్లో చోటు దక్కింది. అయినా మనకు 61 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హాకీ జట్టు కాంస్యం సాధించింది. పారా క్రీడల్లో 2పతకాలు దక్కాయి. ఈసారి కూడా ఆస్ట్రేలియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌, కెనడా ఉన్నాయి. చివరిరోజు వరకు 5వ స్థానంలో ఉన్న భారత్‌.. ఏకంగా నాలుగు స్వర్ణాలను గెలిచి న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి నాల్గోస్థానానికి ఎగబాకింది. గత కామన్వెల్త్‌ క్రీడల వరకు 1875పతకాలు అందజేయగా.. అందులో భారత్‌ 503 పతకాలను సొంతం చేసుకుంది. అందులో 181స్వర్ణ, 173రజత, 149కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ అత్యుత్తమంగా 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో 101(38స్వర్ణాలు) పతకాలతో రెండోస్థానంలో నిలిచింది.

  • 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల గెలిచిన అథ్లెట్లు..

బంగారు పతక విజేతలు(22)...
రెజ్లింగ్‌(6): నవీన్‌ కుమార్‌, వినేష్‌ ఫోగట్‌, రవి కుమార్‌ దహియా, దీపక్‌ పూనియా, సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పూనియా
వెయిట్‌ లిఫ్టింగ్‌ (3): అచింత షౌలీ, లాల్‌రినుంగ జెరెమీ, మీరాబాయి ఛాను
టేబుల్‌ టెన్నిస్‌ (4): శరత్‌ కుమార్‌ ఆచంట, మిక్స్‌డ్‌ డబుల్స్‌(శరత్‌, శ్రీజ ఆకుల), భవీనా పటేల్‌(మహిళల సింగిల్స్‌ క్లాసెస్‌ 3-5), పురుషుల టీం (హర్మీత్‌ దేశారు, సనీల్‌ శెట్టి, శరత్‌ కమల్‌ ఆచంట, సాతియాన్‌ జ్ఞానశేఖర్‌)
పారా పవర్‌లిఫ్టింగ్‌: సుధీర్‌ జి
లాన్‌ బౌల్స్‌: మహిళల ఫోర్స్‌ (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా)
బాక్సింగ్‌ (3): నిఖత్‌ జరీన్‌, అమిత్‌ పంఘాల్‌, నీతూ ఘంఘాస్‌
బాడ్మింటన్‌ (3): పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌ రెడ్డి, చిరాగ్‌ శెట్టి), లక్ష్యసేన్‌, పివి సింధు
అథ్లెటిక్స్‌: ఎల్డ్‌హౌస్‌ పాల్‌రజత పతక విజేత(16)...
అథ్లెటిక్స్‌ (4): అబ్దుల్లా అబూబకర్‌, అవినాష్‌ ముకుంద్‌, ప్రియాంక, శ్రీశంకర్‌,
బాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌ (కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ రెడ్డి, సుమీత్‌ రెడ్డి, లక్ష్యసేన్‌, చిరాగ్‌ శెట్టి, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్‌, మచిమండ పొన్నప్ప, పుల్లెల గాయత్రి, పీవీ సింధు)
బాక్సింగ్‌: సాగర్‌ అహ్లావత్‌
క్రికెట్‌: మహిళల జట్టు
హాకీ: పురుషుల జట్టు
జూడో (2): తులికా మాన్‌, సుశీలా దేవి
లాన్‌ బౌల్స్‌: పురుషుల ఫోర్స్‌ టీం
టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ (శరత్‌ కమల్‌, సాతియాన్‌ జ్ఞానశేఖరన్‌)
వెయిట్‌ లిఫ్టింగ్‌ (3): వికాస్‌ ఠాకూర్‌, బింద్యారాణి దేవి, సంకేత్‌ మహాదేవ్‌ సర్గార్‌
రెజ్లింగ్‌: అన్షు మాలిక్‌

  • కాంస్య పతక విజేతలు(23)..

రెజ్లింగ్‌(5): దీపక్‌ నెహ్రా, పూజా సిహాగ్‌, పూజా గెహ్లాట్‌, మోహిత్‌ గ్రెవాల్‌, దివ్య కక్రాన్‌
వెయిట్‌లిఫ్టింగ్‌ (4): గుర్దీప్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ సింగ్‌, హర్జీందర్‌ కౌర్‌, గురురాజ పూజారి
టేబుల్‌ టెన్నిస్‌ (2): సాతియాన్‌ జ్ఞానశేఖరన్‌, సోనాల్‌బేన్‌ మనుభాయి పటేల్‌
స్క్వాష్‌ (2): మిక్స్‌డ్‌ డబుల్స్‌ (దీపికా పల్లికల్‌, సౌరవ్‌ ఘోసల్‌), సౌరవ్‌ ఘోసల్‌
జూడో: విజయ్ కుమార్‌ యాదవ్‌

  • హాకీ: మహిళల జట్టు

బాక్సింగ్‌ (3): రోహిత్‌ టోకాస్‌, హుస్సాముద్దీన్‌ మహమ్మద్‌, జాస్మిన్‌ లంబోరియా
బాడ్మింటన్‌ (2): మహిళల డబుల్స్‌ (జాలీ ట్రీసా, పుల్లెల గాయత్రి), కిదాంబి శ్రీకాంత్‌
అథ్లెటిక్స్‌: అన్ను రాణి, సందీప్‌ కుమార్‌, తేజస్విన్‌ శంకర్‌