Sep 22,2022 21:32

గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసుపై సిబిఐ కోర్టుకు 'సుప్రీం' సూచన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డిపై అక్రమ మైనింగ్‌ కేసులకు సంబంధించి ట్రయల్‌ కోర్టులో ఉన్న పిటిషన్లపై విచారణ వేగంగా పూర్తి చేయాలని సిబిఐ కోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ నెల 29లోగా ఆయా పిటిషన్లపై విచారణ పూర్తి చేయడంతోపాటు వీలైతే తీర్పు కూడా ఇవ్వాలని పేర్కొంది. బెయిల్‌ షరతులు సడలించాలంటూ గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. డిశ్చార్జి పిటిషన్ల వల్లే ట్రయల్‌ ఆలస్యం అవుతోందని ధర్మాసనానికి సిబిఐ వివరించింది. 'పిటిషనరు తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ అభ్యర్థన మేరకు విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తున్నాం. ఈ మధ్యలో నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ట్రయల్‌ కోర్టు విచారణ పూర్తి చేయాలి. వీలైతే తీర్పు కూడా ఇవ్వాలి. విచారణ సందర్భంగా ఎలాంటి వాయిదాలూ ఇవ్వరాదు. ఈ ఆదేశాలు సిబిఐ ప్రత్యేక కోర్టుకు కమ్యూనికేట్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం' అని ధర్మాసనం పేర్కొంది.